17 ఏళ్ల నిర్బంధానంతరం బంగ్లాకు తారిఖ్ రీఎంట్రీ: భారత్‌కు కలిసొచ్చేనా?

గతంలో ఎదురైన కేసులు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా లండన్‌లో గడిపిన తారిఖ్ ఇప్పుడు తిరిగి బంగ్లాదేశ్ రాజకీయ రంగంలో క్రియాశీల పాత్ర పోషించనున్నారనే అంచనాలు పెరుగుతున్నాయి. ఆయన రాకతో BNPకి కొత్త ఊపొస్తుందని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Tariq's reentry to Bangladesh after 17 years of detention: Will he be reunited with India?

Tariq's reentry to Bangladesh after 17 years of detention: Will he be reunited with India?

. ప్రవాస జీవితం నుంచి స్వదేశ రాజకీయాల వైపు

. మత ఛాందసవాదానికి చెక్ పెట్టే అవకాశమా?

. భారత్‌తో సంబంధాలపై సానుకూల ప్రభావం

Tarique Rahman: దాదాపు 17 ఏళ్లుగా స్వీయ బహిష్కరణలో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) కీలక నేత, ‘డార్క్ ప్రిన్స్’గా ప్రసిద్ధి చెందిన తారిఖ్ రెహమాన్ స్వదేశానికి తిరిగిరానున్న వార్త దేశ రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తోంది. ఈ పరిణామాన్ని దౌత్యవేత్తలు, రాజకీయ విశ్లేషకులు ఒక చారిత్రక మలుపుగా అభివర్ణిస్తున్నారు. గతంలో ఎదురైన కేసులు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా లండన్‌లో గడిపిన తారిఖ్ ఇప్పుడు తిరిగి బంగ్లాదేశ్ రాజకీయ రంగంలో క్రియాశీల పాత్ర పోషించనున్నారనే అంచనాలు పెరుగుతున్నాయి. ఆయన రాకతో BNPకి కొత్త ఊపొస్తుందని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో మత ఛాందసవాద శక్తులు బలపడుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జమాత్ ఏ ఇస్లామీ వంటి యాంటీ ఇండియా, పాకిస్థాన్ అనుకూల భావజాలం కలిగిన శక్తులు రాజకీయంగా ప్రభావం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తారిఖ్ రెహమాన్ నాయకత్వంలోని BNP ఒక కీలక సమతుల్య శక్తిగా మారే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లౌకికవాదం, జాతీయ సార్వభౌమత్వం అనే అంశాలపై BNP స్పష్టమైన వైఖరి తీసుకుంటే, మత ఆధారిత రాజకీయాలకు గట్టి కట్టడి పడుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. తారిఖ్ రాజకీయ వ్యూహం ఎలా ఉంటుందన్నదానిపై దేశ భవిష్యత్ రాజకీయ దిశ ఆధారపడనుంది. తారిఖ్ రెహమాన్ స్వదేశానికి రాకను భారత్‌కు అనుకూల అంశంగా కూడా విశ్లేషిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పడితే, ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడే అవకాశముందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.

భద్రత, వాణిజ్యం, సరిహద్దు సహకారం వంటి అంశాల్లో భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు గతంలో కీలక దశలను చూసాయి. అయితే రాజకీయ అస్థిరత, వాద శక్తుల ప్రభావం ఈ సంబంధాలకు సవాళ్లుగా మారాయి. BNP బాధ్యతాయుతంగా పాలన చేపడితే, ప్రాంతీయ స్థిరత్వానికి అది దోహదపడుతుందని అంచనా. అంతేకాదు, పాకిస్థాన్ అనుకూల శక్తుల ప్రభావం తగ్గితే దక్షిణాసియాలో శాంతి, సహకారం మరింత బలపడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తారిఖ్ రెహమాన్ స్వదేశానికి తిరిగి రావడం కేవలం ఒక నేత రాకగా మాత్రమే కాకుండా, బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాందిగా భావిస్తున్నారు. ఆయన నాయకత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి, తీవ్రవాద ధోరణులకు అడ్డుకట్ట వేస్తుందా? భారత్‌తో సహా పొరుగుదేశాలతో సంబంధాలను కొత్త దిశలో నడిపిస్తుందా? అన్న ప్రశ్నలకు రాబోయే రోజులు సమాధానం ఇవ్వనున్నాయి.

  Last Updated: 25 Dec 2025, 01:03 PM IST