. ఖలీదా జియా అనంతరం పార్టీకి కొత్త దిశ
. ‘పాత రాజకీయాలు మళ్లీ రావు’..తారిఖ్ రహ్మాన్ వ్యాఖ్యలు
. ఎన్నికల ముంగిట బీఎన్‌పీకి అనుకూల వాతావరణం
Bangladesh : బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఛైర్మన్‌గా తారిఖ్ రహ్మాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల మరణించిన పార్టీ మాజీ ఛైర్‌పర్సన్, మాజీ ప్రధాని ఖలీదా జియా మరణంతో ఈ పదవి ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తారిఖ్ రహ్మాన్‌ను కొత్త ఛైర్మన్‌గా ఎన్నుకున్నట్లు బీఎన్‌పీ కార్యదర్శి జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లామ్ అలంగీర్ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం బీఎన్‌పీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా దేశ రాజకీయాల్లో మార్పులకు సంకేతంగా మారింది. దీర్ఘకాలంగా పార్టీకి దూరంగా ఉన్న తారిఖ్ రహ్మాన్ తిరిగి నాయకత్వ బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఖలీదా జియా ఒక కీలక అధ్యాయం. ఆమె నాయకత్వంలో బీఎన్‌పీ ఎన్నో రాజకీయ పోరాటాలను ఎదుర్కొంది. అయితే అనారోగ్య కారణాలతో ఆమె మరణం పార్టీకి తీరని లోటుగా మారింది. ఈ పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అనుభవం కలిగిన నేతగా తారిఖ్ రహ్మాన్‌ను ఛైర్మన్‌గా ఎన్నుకోవడం అనివార్యమైందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇది తారిఖ్ రహ్మాన్‌పై పార్టీ నాయకత్వానికి ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఛైర్మన్‌గా ఎన్నికైన అనంతరం తారిఖ్ రహ్మాన్ మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఆగస్టు 5కు ముందు ఉన్న రాజకీయ పరిస్థితులు మళ్లీ దేశంలో పునరావృతం కావని స్పష్టం చేశారు. ఇది షేక్ హసీనా పాలన కాలాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
బంగ్లాదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, దేశానికి ప్రజాస్వామ్య వాతావరణం అవసరమని ఆయన అన్నారు. అణచివేత రాజకీయాలు, ప్రతిపక్షాలపై ఆంక్షలు ఇక కొనసాగకూడదని స్పష్టం చేశారు. 17 ఏళ్ల తరువాత బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన తారిఖ్ రహ్మాన్ ఇప్పుడు ప్రధాని అభ్యర్థి రేసులో ముందున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని బీఎన్‌పీ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో పాల్గొనకుండా తప్పుకున్న షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌పై నిషేధం విధించబడటం బీఎన్‌పీకి మరింత కలిసొచ్చే అంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీఎన్‌పీ విజయం నల్లేరుపై నడకగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తారిఖ్ రహ్మాన్ నాయకత్వం బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందన్న అంచనాలు బలపడుతున్నాయి.
