Taliban Vs Polio : ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ పాలకులు మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఈ దఫా వాళ్లు పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిలిపివేశారు. ఫలితంగా ఈనెలలో పోలియో చుక్కలు వేస్తారని ఎదురుచూస్తున్న ఎంతోమంది పసికందులను ఆరోగ్యపరమైన ముప్పు అలుముకుంది. ఈఏడాది జూన్ నుంచే ఆఫ్ఘనిస్తాన్‌లో పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఐక్యరాజ్యసమితి ముమ్మర ప్రచారం చేసింది. ఇంతకుముందు ఐరాస వలంటీర్లు ప్రతీ ఇంటికి వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేసేవారు. ఈసారి తాలిబన్ పాలకుల సూచన మేరకు ప్రతీ గ్రామంలో మసీదులు కేంద్రంగా పోలియో వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించేందుకు ఐరాస అంగీకరించింది. అయినా పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఆపేస్తూ అకస్మాత్తుగా తాలిబన్లు(Taliban Vs Polio) ప్రకటన చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటి ? అనేది మాత్రం తాలిబన్లు వెల్లడించలేదు.
ఈ సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్‌లో 18 పోలియో కేసులను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించింది. గతేడాది కేవలం 6 పోలియో కేసులే బయటపడ్డాయి. అంటే గత ఏడాది వ్యవధిలో పోలియో కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగిపోయింది. ఆ దేశంలో విస్తరిస్తున్న పోలియో ముప్పును ఇది అద్దంపడుతోంది. ఇంకా ధృవీకరణకు నోచుకోని పోలియో కేసులు కూడా పెద్దసంఖ్యలోనే ఉండొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read :Elon Musk Bodyguards : అంత సెక్యూరిటీయా.. బాత్‌రూంలోనూ వదలని మస్క్ సెక్యూరిటీ గార్డ్స్!
పాకిస్తాన్‌లోని చాలా ప్రావిన్సుల ప్రజలు నేటికీ పోలియో వ్యాక్సినేషన్‌ను వ్యతిరేకిస్తున్నారు. పోలియో చుక్కలు వేస్తే పిల్లల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందనే అపోహ అక్కడి కొన్ని వర్గాల ప్రజల్లో ఉంది. ఈ కారణం వల్ల గతంలో అక్కడ పోలియో వ్యాక్సినేషన్ కేంద్రాలపై దాడులు కూడా జరిగాయి. దీనివల్ల ఎంతోమంది పిల్లలు పోలియో చుక్కలకు నోచుకోలేదు. బహుశా ఈ తరహా భావజాలానికి ప్రభావితులై తాలిబన్లు ఈసారి పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఆపరా ? అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. తాలిబన్ల తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజారోగ్యం విషయంలో ఇలాంటి మొండి వైఖరిని తాలిబన్లు వీడాలని ఆ సంస్థలు సూచిస్తున్నాయి.