Site icon HashtagU Telugu

Syria Rebels : ‘‘సిరియాలో ఇక కొత్త శకం.. చీకటి కాలాన్ని ముగించాం’’ : సిరియన్ రెబల్స్

Bashar al-Assar

Bashar al-Assar

Syria Rebels : సిరియన్ రెబల్స్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన విడుదల చేశారు. సిరియాలో కొత్త శకం ప్రారంభమైందని వెల్లడించారు. చీకటి కాలానికి తాము ముగింపు పలికినట్లు తెలిపారు. విదేశాలకు వెళ్లిపోయిన సిరియన్లు  ఇక సిరియాకు తిరిగి రావాలని రెబల్స్ కోరారు. 50ఏళ్ల అణచివేత, 13 సంవత్సరాల దౌర్జన్యం వల్ల ఎందరో సిరియన్లు దేశం విడిచి వెళ్లిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ నిరంకుశ పాలన నుంచి సిరియాకు విముక్తి  లభించిందని రెబల్స్(Syria Rebels) ప్రకటించారు. అసద్‌ దేశం విడిచి పారిపోయినట్లు తెలిపారు.  సిరియాలోని రాజధాని డమస్కస్‌ సహా పలు నగరాలను రెబల్స్ స్వాధీనం చేసుకున్నారు.

Also Read :Strange Marriage Custom : వరుడు యువతిలా.. వధువు యువకుడిలా మారిపోతారు.. వెరైటీ పెళ్లి సంప్రదాయం

‘హయాత్‌ తహరీర్‌ అల్‌ షామ్‌’ (హెచ్‌టీఎస్‌) అనే సంస్థ సారథ్యంలోని తిరుగుబాటుదారులు ఆదివారం తెల్లవారుజామున సిరియా రాజధాని డమస్కస్‌‌లోకి ప్రవేశించారు. ఈ పరిణామం జరగడానికి కొన్ని గంటల ముందే ‘ఎస్‌వైఆర్‌9218’ అనే రష్యా తయారీ ఐఎల్‌-76 విమానంలో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ పారిపోయారు. అయితే ఆయన ఎక్కడికి వెళ్లారు అనేది తెలియరాలేదు. ఆయన ఖతర్ లేదా టర్కీకి వెళ్లి ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.

Also Read :Khatija Rahman : ‘‘మా నాన్న కెరీర్ గురించి అసత్య ప్రచారం ఆపండి’’: ఖతీజా రెహమాన్‌

2011లో సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌అసద్‌కు వ్యతిరేకంగా ప్రజలు నిరసనకు దిగారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈ ఉద్యమాన్ని అసద్ దారుణంగా అణచివేశారు. దీంతో దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. గత రెండు, మూడేళ్లలో సిరియాలో అంతర్యుద్ధం తీవ్రత కొంతమేర తగ్గింది. సిరియాలో జరిగిన ఘర్షణల్లో గత 13 ఏళ్లలో దాదాపు 6 లక్షల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నగరాలకు నగరాలు బూడిద కుప్పలుగా మారాయి. బషర్ అల్ అసద్‌కు రష్యా, ఇరాన్ దేశాలు అండగా నిలిచాయి. రెబల్స్‌కు అమెరికా, టర్కీ, నాటో దేశాల నుంచి సహాయ సహకారాలు అందాయి.