Site icon HashtagU Telugu

Nobel Prize: స్వీడిష్ స్వాంటె పాబోకు వైద్యశాస్త్రంలో నోబెల్‌ బహుమతి

Nobbel Imresizer

Nobbel Imresizer

వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు స్వీడన్ కు చెందిన స్వాంటె పాబోను ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం -2022 వరించింది. మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్‌ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు ఆయనకు ఈ బహుమతి దక్కింది. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ బృందం దీనిని ప్రకటించింది. దాదాపు 40 వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన మానవ జాతికి చెందిన నియాండర్తల్‌ల జన్యు సంకేతాన్ని ఛేదించడం అసాధ్యం అనుకున్న సమయంలో ఆ పనిని పాబో సాధించాడని ప్రైజ్ కమిటీ తెలిపింది. పాబో ప్రశాంతంగా కాఫీ తాగుతూ తన కూతురుని నిద్రలేపడానికి వెళుతున్నప్పుడు ఆయనకు నోబెల్‌ ప్రకటించినట్లు ఫోన్ వచ్చింది. ఆయన వెంటనే ఆ వార్తను తన భార్య లిండాకు తెలియజేసి ఆనందం పంచుకున్నారు. తాను ఇది ఊహించలేదని, వార్త విని చాలా ఆశ్చర్యపోయినట్లు పాబో చెప్పారు.

గతేడాది ఉష్ణ గ్రాహకాలు, శరీర స్పర్శపై చేసిన పరిశోధనలకు అమెరికాకు చెందిన డేవిడ్‌ జూలియస్‌, అర్డెమ్‌ పటాపౌటియన్‌లు సంయుక్తంగా నోబెల్‌ బహుమతి అందుకున్నారు. వైద్యవిభాగంతో నోబెల్‌ పురస్కార గ్రహీత పేర్ల ప్రకటన మొదలైంది. మిగిలిన రంగాలలోని విజేతల పేర్ల ప్రకటన వారంరోజుల పాటు కొనసాగుతుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యం విభాగంలో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం 2022 నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబరు 10న అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.

నోబెల్‌ బహుమతి గ్రహీతలకు దాదాపు 9 లక్షల డాలర్ల నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబరు 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదు ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించిన తరువాత 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా అందజేస్తున్నారు.

Exit mobile version