Site icon HashtagU Telugu

Gun Fired at Trump Rally: ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌పై కాల్పులు.. కుడిచెవిలోకి బుల్లెట్ ?

Shooting At Trump Rally

Gun Fired at Trump Rally:  అమెరికాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(78) పై ఓ ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ సిటీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగంతకుడు కాల్పులు జరపడంతో ఒక బుల్లెట్ వచ్చి ట్రంప్ కుడి చెవి కింది భాగంలో తాకింది. దీంతో అక్కడ ట్రంప్‌కు రక్తస్రావం మొదలైంది. బాగా నొప్పిగా ఉండటంతో ట్రంప్ తన చేతితో కుడి చెవిని గట్టిగా(Gun Fired at Trump Rally) పట్టుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join

దీంతో వెంటనే అలర్ట్ అయిన అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ పరుగున పరుగున వచ్చి ట్రంప్‌ను చుట్టుముట్టారు. ట్రంప్‌ను చుట్టుముట్టి వేదికపై నుంచి సురక్షితంగా కిందికి దింపారు. ఈక్రమంలో అక్కడున్న ప్రజల వైపు చూస్తూ ట్రంప్ పదేపదే తన పిడికిలిని పైకి లేపారు. అక్కడి నుంచి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అత్యవసర వైద్యం అందించిన వైద్యులు ట్రంప్ సురక్షితంగానే ఉన్నారని ప్రకటించారు. అనంతరం ట్రంప్ కూడా తాను బాగానే ఉన్నానని, ఆందోళన చెందొద్దని మరో ప్రకటన విడుదల చేశారు. ఇక ఈ కాల్పులు జరిపిన దుండగుడు భద్రతా సిబ్బంది కాల్పుల్లో మరణించినట్లు తేలింది. షూటర్ జరిపిన కాల్పుల్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఓ వ్యక్తి చనిపోయాడని వెల్లడైంది. వచ్చే వారమే  మిల్వాకీ నగరంలో కీలకమైన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌ జరగనుంది. ఇందులోనే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటిస్తారు.

గతంలో..

అమెరికాలో దేశ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులకు గట్టి భద్రత ఉంటుంది. మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ 1963లో తన మోటర్‌కేడ్‌లో వెళుతుండగా హత్యకు గురయ్యారు. ఆయన సోదరుడు బాబీ కెనడీ 1968లో కాల్చి చంపబడ్డారు. మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ 1981లో హత్యాయత్నం నుంచి కొంచెంలో తప్పించుకున్నారు.

Also Read :Ricky Ponting: రికీ పాంటింగ్‌కు షాకిచ్చిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌.. త‌దుప‌రి కోచ్‌గా గంగూలీ..?

బైడెన్ రియాక్షన్

డెలావేర్‌లోని రెహోబోత్‌లో ఉన్న తన ఇంటి నుంచి అమెరికా అధ్యక్షుడు 81 ఏళ్ల జో బైడెన్ ఓ సందేశాన్ని విడుదల చేశారు.  ‘‘అమెరికాలో ఈ రకమైన హింసకు చోటు లేదు’’ అని ఆయన ప్రకటించారు. ‘‘ట్రంప్ సురక్షితంగా ఉన్నాడని విన్నందుకు నాకు సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. “నేను ట్రంప్ కోసం, ట్రంప్ కుటుంబం కోసం, ర్యాలీలో ఉన్న వారందరి కోసం ప్రార్థిస్తున్నాను” అని బైడెన్ పేర్కొన్నారు.

ఒబామా స్పందన

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందిస్తూ..  “మన ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు ఖచ్చితంగా స్థానం లేదు” అని  అన్నారు.”ఏమి జరిగిందో మాకు ఇంకా సరిగ్గా తెలియనప్పటికీ, మాజీ అధ్యక్షుడు ట్రంప్(Trump) తీవ్రంగా గాయపడలేదని మనమందరం ఉపశమనం పొందాలి. మన రాజకీయాల్లో నాగరికత, గౌరవానికి మళ్లీ కట్టుబడి ఉండటానికి ఈ క్షణాన్ని ఉపయోగించుకోవాలి” అని ఒబామా చెప్పారు.

ఎలాన్ మస్క్ స్పందన

బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. “నేను అధ్యక్షుడు ట్రంప్‌ను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.