. ఖమేనీపై ట్రంప్ తీవ్ర విమర్శలు
. ఖమేనీ ఆరోపణలకు ట్రంప్ కౌంటర్
. నిరసనలకు పిలుపు, పెరుగుతున్న మృతులు
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాలు ప్రపంచాన్ని కలచివేస్తున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అక్కడ ప్రజలపై దాడులు జరుగుతున్నాయని దీనికి పూర్తి బాధ్యత ఖమేనీదేనని ఆరోపించారు. నాయకుడిగా ఉండి తన దేశ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వ్యక్తి, వేలాది మందిని మృత్యువాత పడేలా చేశాడని మండిపడ్డారు. ఇరాన్ ప్రజలు ఆయనకు నాయకత్వం అప్పగించింది భయాన్ని, మరణాలను సృష్టించేందుకు కాదని ట్రంప్ స్పష్టం చేశారు. ఖమేనీ పాలనలో ఇరాన్ తన పునాదులనే కోల్పోతోందని దేశాన్ని నాశనం చేస్తున్న నాయకుడిగా ఆయన చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో ఖమేనీ పాలన కొనసాగించడం అన్యాయమని పేర్కొన్నారు. ఇక ఆయన అధికారంలో ఉండే నైతిక హక్కు కోల్పోయారని ఇప్పుడు ఆయన దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తు కోసం కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
ఇరాన్‌లో నెలకొన్న ఆందోళనలకు అమెరికానే కారణమని ఖమేనీ ఆరోపించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఖమేనీ మాట్లాడుతూ..ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలకు ట్రంప్ ప్రత్యక్షంగా మద్దతిస్తున్నారని అందుకే ఆయనను నేరస్థుడిగా పరిగణిస్తున్నామని ప్రకటించారు. నిరసనల్లో పాల్గొంటున్నవారు దేశ ప్రజలు కాదని అమెరికా కోసం పనిచేసే ఏజెంట్లేనని ఖమేనీ ఆరోపించారు. ఇరాన్‌ను అణచివేయడం తమపై ఆధిపత్యం చలాయించడమే లక్ష్యంగా అమెరికా ఈ కుట్ర పన్నుతోందని ఖమేనీ తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ట్రంప్ మరోసారి ఖమేనీపై మాటల దాడి చేశారు. ఇరాన్‌లో జరుగుతున్న హింసకు బయటి శక్తులు కాదు అక్కడి పాలకులే కారణమని స్పష్టం చేశారు. ప్రజలపై దమనకాండ సాగిస్తూ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ఇతరులపై నిందలు మోపడం సరైంది కాదని ట్రంప్ హితవు పలికారు.
ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలను మరింత తీవ్రతరం చేయాలని ప్రవాసంలో ఉన్న యువరాజు రెజా పహ్లావి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ కోసం ఇది కీలక సమయమని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజల పోరాటానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అండగా నిలుస్తారని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఇరాన్‌లో హింసాత్మక ఘటనలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇప్పటి వరకు మూడు వేల మందికిపైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వేలాది మంది గాయపడగా అనేక మంది అరెస్టులకు గురయ్యారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందన్నది అంతర్జాతీయంగా ఆసక్తికర అంశంగా మారింది.
