Kabul Blast: కాబూల్‌లో ఆత్మాహుతి దాడి, 19 మంది మృతి

ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లోని విద్యా కేంద్రంపై ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.

  • Written By:
  • Updated On - September 30, 2022 / 01:28 PM IST

ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లోని విద్యా కేంద్రంపై ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఆ దాడిలో 19 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు. ఆ మేర‌కు కాబూల్ పోలీసు చీఫ్ కోసం తాలిబాన్ నియమించిన ప్రతినిధి ప్ర‌క‌టించారు. కాబూల్‌లోని దస్తీ బార్చి పరిసరాల్లోని సెంటర్‌లో పేలుడు శుక్ర‌వారం ఉదయం జరిగిందని అధికార ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు.

తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి కొనసాగుతున్న హింసాత్మక సంఘ‌ట‌నల క్ర‌మంలో తాజాగా ఆత్మాహుతి దాడిని కొన‌సాగింపుగా ప‌రిగ‌ణిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని మైనారిటీ షియా కమ్యూనిటీ సభ్యులు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఈ దాడి జ‌రిగింది. దీనికి బాధ్యులు ఎవ‌రు అనేది నిర్థారించ‌లేక‌పోతున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆగస్టు 2021లో స్వాధీనం చేసుకున్నారు. ఆనాటి నుంచి తాలిబన్ల‌ ప్రధాన ప్రత్యర్థి అయిన ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ దష్టి బార్చీతో సహా హజారా కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుంది. కానీ ఆ గ్రూప్ ఆత్మాహుతికి పాల్ప‌డింద‌ని తాలిబ‌న్ ప్ర‌భుత్వ ఇప్ప‌టి వ‌ర‌కు నిర్థారించ‌లేదు. వివరాలను తెలుసుకోవడానికి తాలిబ‌న్ ప్ర‌భుత్వ బృందాలు సంఘట‌నా స్థ‌లానికి చేరుకున్నాయ‌ని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ నఫీ టాకోర్ వెల్ల‌డించారు.