Strongest Earthquake : తైవాన్‌‌లో భారీ భూకంపం.. జపాన్, ఫిలిప్పీన్స్‌లలో సునామీ హెచ్చరిక జారీ

Strongest Earthquake : భారీ భూకంపంతో తైవాన్‌ రాజధాని తైపీ వణికిపోయింది.

  • Written By:
  • Updated On - April 3, 2024 / 09:51 AM IST

Strongest Earthquake : భారీ భూకంపంతో తైవాన్‌ రాజధాని తైపీ వణికిపోయింది. రిక్టర్​ స్కేల్​పై భూకంప తీవ్రత 7.5గా నమోదైందని అమెరికా ​ జియోలాజికల్​ సర్వే సంస్థ వెల్లడించింది. అయితే భూకంప తీవ్రత  7.2గా నమోదైందని తైవాన్​ భూకంప పర్యవేక్షణ ఏజెన్సీ తెలిపింది. బుధవారం తెల్లవారుజామున తైవాన్ తూర్పు తీరంలో సంభవించిన ఈ భూకంపం(Strongest Earthquake) ధాటికి అనేక భవనాలు నేలకూలాయి. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నందున 3 మీటర్ల మేర సునామీ వచ్చే అవకాశం ఉందని తైవాన్​ కేంద్ర వాతావరణ పరిపాలన విభాగం అంచనా వేసింది.  భూకంప కేంద్రం తైవాన్‌లోని హువాలియన్ నగరానికి దక్షిణంగా 18 కిమీ దూరంలో ఉందని గుర్తించారు. హువాలియన్‌లో చాలా భవనాలు కూలిపోయాయి. గత 25 ఏళ్లలో తైవాన్‌లో ఇదే అత్యంత బలమైన భూకంపమని అధికారులు తెలిపారు. చివరిసారిగా 1999 సెప్టెంబరులో  తైవాన్‌లో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పట్లో భూకంపం వల్ల  2,400 మంది ప్రాణాలు కోల్పోగా, 5,000 భవనాలు ధ్వంసమయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join

తైవాన్ మీడియాలో ఆ వీడియోలు..

తైవాన్ రాజధాని తైపీలో పలు భవనాలు బాగా కుదుపునకు గురయ్యాయని తెలుస్తోంది.  ఆయా ఇళ్లలోని షెల్ఫ్‌లు కదలడం, వస్తువులన్నీ షేక్ కావడం, ఫర్నీచర్ దొర్లడం వంటివన్నీ జరిగాయని సమాచారం. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం ప్రభావంతో తైవాన్‌లోని పర్వత ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడినట్లు తెలిసింది. వాటి వల్ల ఎంత నష్టం జరిగిందో ఇంకా తెలియరాలేదు. తైవాన్ మీడియాలో ప్రసారం చేస్తున్న వీడియోలలో చాలా ఇళ్లు కూలినట్లు స్పష్టంగా చూపిస్తున్నారు.  రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అందులో కనిపిస్తోంది. తైవానీస్ చిప్‌మేకింగ్ దిగ్గజం TSMC తన సిబ్బంది భద్రత కోసం Hsinchu నగరం, దక్షిణ తైవాన్‌లోని కొన్ని ఫ్యాక్టరీలను ఖాళీ చేసింది. Apple, Nvidia సహా పలు దిగ్గజ టెక్ కంపెనీల కోసం TSMC సెమీకండక్టర్లను తయారు చేస్తుంటుంది.

జపాన్, ఫిలిప్పీన్స్‌లలో సునామీ హెచ్చరికలు

తైవాన్  భూకంపం ఎఫెక్టుతో దాని పొరుగు దేశాలైన జపాన్, ఫిలిప్పీన్స్‌లలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.  భూకంపం సంభవించిన  దాదాపు 30 నిమిషాల తర్వాత సునామీ మొదటి అల తమ దేశ దక్షిణ భాగంలోని మియాకో, యాయామా దీవుల తీరాలను తాకినట్లు జపాన్​ పేర్కొంది. దక్షిణ జపాన్​లోని ఒకినావాకు ద్వీపానికి సునామీ హెచ్చరికలు జారీ చేశామని తెలిపింది.  ఈ భూకంపం ధాటికి ఆయా దీవుల్లోని అనేక భవనాలు నేలకూలాయని చెప్పింది. జపాన్ నైరుతి తీరానికి 3 మీటర్ల ఎత్తులో సునామీ అలలు చేరుకునే ముప్పు ఉందని ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. వచ్చే వారం రోజుల పాటు సునామీ రిస్క్ ఉందని ఆయా ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించింది. ఇక ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కూడా తీర ప్రాంతాల ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు చైనాలోని ఆగ్నేయ ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు వచ్చాయని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

Also Read :Dinesh Karthik: దినేష్ కార్తీక్ పేరిట ఓ ప్ర‌త్యేక రికార్డు.. ధోనీ, కోహ్లీ, రోహిత్ కూడా సాధించ‌లేని ఘ‌న‌త ఇదీ..!