ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక (Sri Lanka) టోక్ మకాక్ జాతికి చెందిన లక్ష కోతులను (Monkeys) చైనా (China)కు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతోంది. టోక్ మకాక్ శ్రీలంకకు చెందిన ఒక జాతి. టోక్ మకాక్‌లను కొనుగోలు చేయాలన్న చైనా అభ్యర్థనను అధ్యయనం చేయాలని శ్రీలంక వ్యవసాయ మంత్రి మహింద అమరవీర అధికారులను ఆదేశించారు. చైనా తన జంతుప్రదర్శన శాలల కోసం ఈ జాతి కోతులను కొనుగోలు చేయాలని చూస్తోంది. 1000 జంతుప్రదర్శనశాలలకు 100,000 కోతుల కోసం చైనా చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవచ్చని లంక మంత్రి చెప్పారు. తొలిదశలో కోతులను చైనాకు పంపేందుకు మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక వివరాలు అందుబాటులోకి రాలేదు.
Also Read: Explosion At Texas: అమెరికాలో ఘోర విషాదం.. మంటల్లో చిక్కుకుని 18,000 గోవులు సజీవ దహనం
అమరవీరతో పాటు వ్యవసాయ మంత్రిత్వ శాఖ, నేషనల్ జూలాజికల్ పార్క్, వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. శ్రీలంకలో కోతుల బెడద 30 లక్షలకు చేరుకుందని, ఆ ప్రాంతంలో సాగు చేస్తున్న పంటలకు కోతుల బెడద ఉందని ఈ సమావేశంలో తెలియజేశారు. శ్రీలంకకు కోతుల ఎగుమతికి సంబంధించిన చట్టపరమైన విధానాలపై కమిటీ ఏర్పాటుపైనా చర్చించారు. ముఖ్యంగా కోతులను నియంత్రించడానికి శ్రీలంక ప్రయత్నిస్తున్న సమయంలో చైనా నుండి టోక్ మకాక్‌లకు డిమాండ్ వచ్చింది.
శ్రీలంక అన్ని రకాల జంతువుల ఎగుమతిని నిషేధించింది. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో కోతుల ఎగుమతి అంశాన్ని పరిశీలిస్తుండడం గమనార్హం. అయితే, చైనా గత సంవత్సరం రక్షిత జంతువుల జాబితా నుండి కొన్ని జాతుల జంతువులను తొలగించింది. వాటిలో దేశంలోని మూడు కోతుల జాతులు, నెమళ్లు, ఇతరాలు ఉన్నాయి. శ్రీలంకకు అతిపెద్ద రుణదాతలలో చైనా ఒకటని దృష్టిలో ఉంచుకుని, కోతుల విషయంలో ఆ దేశం చేసిన అభ్యర్థనను శ్రీలంక పరిశీలిస్తుందని సమాచారం.