Site icon HashtagU Telugu

Trump : ట్రంప్‌ ఆరోగ్యంపై ఊహాగానాలు.. ట్రూత్‌ పోస్టుతో ప్రతిస్పందన

Speculations about Trump's health... Response with a Truth post

Speculations about Trump's health... Response with a Truth post

Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారనే వార్తలు తాజాగా సోషల్‌ మీడియాలో వేగంగా చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన ప్రజల మధ్య కనిపించకపోవడం, ఎలాంటి మీడియా సమావేశాలకు హాజరుకాకపోవడం నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. “ట్రంప్ మిస్సింగ్” అంటూ హ్యాష్‌ట్యాగ్లు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారాలపై స్వయంగా ట్రంప్‌ స్పందించారు. సోషల్ మీడియా వేదికైన “ట్రూత్‌ సోషల్‌”లో ట్రంప్‌ చేసిన తాజా పోస్ట్‌ వైరల్‌ అయింది. ఒక కన్జర్వేటివ్‌ కామెంటేటర్‌ చేసిన ఆరోగ్యానికి సంబంధించిన పోస్టుకు ట్రంప్‌ స్పందిస్తూ..నా జీవితంలో ఎన్నడూ ఇంత బెటర్‌గా అనిపించలేదంటూ రాసుకొచ్చారు. ఇదే పోస్టులో వాషింగ్టన్‌ డీసీలో నేరాల స్థాయి గణనీయంగా తగ్గిందని, నగరం ‘క్రైం ఫ్రీ జోన్‌’గా మారిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో పాటు ట్రంప్‌ కుటుంబ సభ్యులతో కలిసి వర్జీనియాలోని స్టెర్లింగ్‌లో ఉన్న తన గోల్ఫ్‌ క్లబ్‌కు వెళ్లిన దృశ్యాలు కూడా వైరల్‌ అయ్యాయి.

Read Also: Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి

అక్కడ ఆయన తెల్లటి పోలో షర్ట్‌, నల్ల ప్యాంటు, ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ అనే ఎరుపు రంగు టోపీ ధరించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ దృశ్యాల ద్వారా ట్రంప్‌ తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు నిజానికి ఏమాత్రం ఆధారం లేదని చాటినట్లయ్యింది. అయితే ఇదంతా ఉన్నప్పటికీ ట్రంప్‌ ఆరోగ్యం గురించి అనుమానాలు పూర్తిగా తీరలేదు. ఇటీవల ఆయన చేతిపై గాయంతో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందేహాలు రేకెత్తించాయి. గతంలోనూ ఈ గాయాన్ని మేకప్‌ ద్వారా దాచినట్లు కొన్ని వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీంతో కొందరు నెటిజన్లు ఇప్పటికే 24 గంటలుగా ట్రంప్‌ కనిపించలేదు, మరికొన్ని రోజులు కూడా పబ్లిక్‌ ఈవెంట్లు లేవు. అసలు ఆయనకు ఏం జరిగిందో అర్థం కావడం లేదు అంటూ ట్వీట్‌ చేశారు. ఈ వార్తల నేపథ్యంలో ట్రంప్‌ ఆరోగ్యం విషయంలో తీవ్రమైన పరిస్థితి తలెత్తితే తాను అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పేర్కొనడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

అయితే ట్రంప్‌కు సమర్థకులు మాత్రం దీనిని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం లేబర్‌ డే వీకెండ్‌ కావడం వల్ల ట్రంప్‌ బహిరంగంగా కనబడట్లేదు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. ట్రూత్‌ సోషల్‌లో చేసిన పోస్టులే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం అంటూ కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాక, అమెరికాలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్న సమయంలో ట్రంప్‌పై న్యూస్‌లను తప్పుదారి పట్టించేందుకు నిర్దిష్టంగా ఈ ప్రచారాలు జరుగుతున్నాయంటూ ట్రంప్‌ అనుచరులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థులు అసత్య వార్తలతో ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ట్రంప్‌ ఆరోగ్యం చుట్టూ ముసురుకున్న అనేక ప్రశ్నలకు మధ్య, ఆయన సోషల్ మీడియా పోస్టులు, బయటకు వచ్చిన ఫొటోలు, మరియు అధికారికంగా ప్రకటించని అయినా ట్రంప్‌ శిబిరం ఇచ్చిన సంకేతాల ఆధారంగా ఆయన ఆరోగ్యంగా ఉన్నారన్నదే స్పష్టమవుతోంది. కానీ పబ్లిక్‌ ఈవెంట్లు లేకపోవడం, మరికొన్ని అనుమానాస్పద లక్షణాలు అందరినీ ఇంకా ఆశ్చర్యంలో నెట్టేస్తున్నాయి.

Read Also: Stock Market : అమెరికా కోర్ట్ తీర్పు, ఇండియా GDP.. షేర్ల మార్కెట్‌పై ప్రభావం ఎలా ఉంది?