Trump: దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన G20 శిఖరాగ్ర సమావేశానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హాజరుకాలేదు. క్రైస్తవుల హత్యలపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం మౌనం వహించిందని, దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ట్రంప్ పరిపాలన పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ఫ్లోరిడాలో జరగబోయే G20 సమ్మిట్‌కు దక్షిణాఫ్రికాను ఆహ్వానించబోమని, అంతేకాకుండా ఆ దేశానికి అందజేస్తున్న అన్ని సబ్సిడీలను కూడా నిలిపివేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడి సోషల్ మీడియా పోస్ట్
ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం (నవంబర్ 28) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో ఒక పోస్ట్ షేర్ చేశారు. పోస్ట్‌లో అధ్యక్షుడు ట్రంప్ ఇలా అన్నారు. దక్షిణాఫ్రికాలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో అమెరికా పాల్గొనకపోవడానికి కారణం దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆఫ్రికానర్స్, డచ్, ఫ్రెంచ్, జర్మన్ మూలాలకు చెందిన ఇతర ప్రజలపై జరుగుతున్న భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలను అంగీకరించడం లేదు. వాటిని పరిష్కరించడం లేదు. స్పష్టంగా చెప్పాలంటే అక్కడ శ్వేతజాతీయులు హత్య చేయబడుతున్నారు. వారి భూములు, పొలాలు లాక్కోబడుతున్నాయని పేర్కొన్నారు.
దీనికంటే దారుణమైన విషయం ఏమిటంటే.. త్వరలో మూతపడనున్న న్యూయార్క్ టైమ్స్, నకిలీ మీడియాగా పిలవబడే పత్రికలు ఈ ‘సామూహిక హత్య’ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాయి. అందుకే కరుడుగట్టిన వామపక్ష మీడియాలోని అబద్ధాలు, కపటం చెప్పేవారు మూతబడుతున్నారని ట్రంప్ రాసుకొచ్చారు.
Also Read: 2027 World Cup: 2027 వన్డే వరల్డ్ కప్‌కు రోహిత్, కోహ్లీ జట్టులో ఉంటారా? క్లారిటీ ఇదే!
దక్షిణాఫ్రికాకు G20 ఆహ్వానం నిరాకరణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా మాట్లాడుతూ.. G20 శిఖరాగ్ర సమావేశం ముగింపు రోజున, G20 అధ్యక్ష పదవిని అప్పగించే కార్యక్రమంలో మా అమెరికన్ రాయబార కార్యాలయం సీనియర్ ప్రతినిధికి అధ్యక్షతను అప్పగించడానికి దక్షిణాఫ్రికా నిరాకరించింది. అందుకే నా ఆదేశాల మేరకు 2026లో అమెరికాలోని ఫ్లోరిడా, మియామి నగరంలో జరగబోయే G20కి దక్షిణాఫ్రికాకు ఇకపై ఆహ్వానం అందదు అని ప్రకటించారు.
G20 సదస్సులో అమెరికా పాల్గొనలేదు
ఈ ఏడాది G20 శిఖరాగ్ర సమావేశం 2025కు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సహా కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, జమైకా వంటి అనేక దేశాల అగ్ర నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ ఏడాది G20 నేతల శిఖరాగ్ర సమావేశాన్ని అమెరికా బహిష్కరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇందులో పాల్గొనలేదు.
