Site icon HashtagU Telugu

Israel – Obama : ఇజ్రాయెల్‌కు ఒబామా వార్నింగ్.. ఏమన్నారంటే ?

Israel Obama

Israel Obama

Israel – Obama : ఇజ్రాయెల్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గట్టి వార్నింగ్ ఇచ్చారు. గాజాలోని అమాయక పౌరులపై ఇజ్రాయెల్ ఇలాగే దాడులను కొనసాగిస్తే.. అవి పాలస్తీనియన్ల మనసుల్లో ఇజ్రాయెల్‌పై శత్రుత్వ వైఖరిని మరింత పెంచుతాయన్నారు. పాలస్తీనా భావితరాలు ఇజ్రాయెల్‌పై విద్వేషాన్ని పెంచుకోవడానికి ఈ భీకర యుద్ధం బాటలు వేయొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ఇజ్రాయెల్‌కు భవిష్యత్తులో కొత్త ముప్పును కొని తెచ్చే అవకాశాలు ఉంటాయని ఒబామా వ్యాఖ్యానించారు. గాజాకు ఆహారం, నీటిని నిలిపివేయడం వంటి ఇజ్రాయెల్ కఠిన చర్యలు పాలస్తీనా ప్రజలను ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మరింత రాటుదేలేలా చేస్తాయని ఒబామా అభిప్రాయపడ్డారు. వీటన్నింటికి తోడు ఈ యుద్ధం పర్యవసానంగా అంతర్జాతీయ సమాజం, ప్రపంచ దేశాలతో ఇజ్రాయెల్‌ సంబంధాలు బలహీనపడే అవకాశం ఉందన్నారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్ – గాజా యుద్ధం గొడ్డలిపెట్టులాంటిదని అభివర్ణించారు.

We’re now on WhatsApp. Click to Join.

అక్టోబర్ 7 నుంచి ఇప్పటివరకు గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 6వేల మందికిపైగా పాలస్తీనా ప్రజలు చనిపోయారు. దాదాపు 15వేల మందికి గాయాలయ్యాయి. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఒబామా సేవలందించిన  సమయంలో ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ దేశ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. మరోవైపు ఆదివారం, సోమవారాల్లో గాజాలోని పలుచోట్ల ఇజ్రాయెల్ ఆర్మీ గ్రౌండ్ ఎటాక్ చేసింది. అయితే హమాస్ మిలిటెంట్ల ప్రతిఘటనలో నలుగురు ఇజ్రాయెలీ సైనికులు చనిపోయారు. ఆ వెంటనే హమాస్ ఉగ్రవాదుల వద్ద రసాయన ఆయుధాలు ఉన్నాయనే ఆరోపణను ఇజ్రాయెల్ ఆర్మీ తెరపైకి తేవడం గమనార్హం.

Also Read: Wagh Bakri: వాగ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ కన్నుమూత.. కారణమిదే..?