ప్రపంచంలోని అత్యంత కాస్ట్లీ నగరాల జాబితాలో సింగపూర్ (Singapore ) మరోసారి అగ్రస్థానం దక్కించుకుంది. జూలియస్ బేర్ (Julius Baer) అనే ప్రముఖ ఆర్థిక సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. వరుసగా మూడో సంవత్సరం సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. జీవన వ్యయం, విలాస వస్తువుల ధరలు, సేవల ధరల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను రూపొందించారు.
సింగపూర్ తర్వాత లండన్ రెండో స్థానాన్ని, హాంకాంగ్ మూడో స్థానాన్ని ఆక్రమించాయి. ఈ నగరాల్లో మిలియనీర్ల సంఖ్య పెరుగుతున్న సందర్భంలో వారు వినియోగిస్తున్న ప్రీమియం సర్వీసులు, ఖరీదైన వస్తువుల ధరలు ఈ స్థాయికి కారణమయ్యాయని నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా గృహాలు, ప్రైవేట్ హెల్త్‌కేర్, ప్రీమియం కార్లు వంటి ఖర్చులు ఎక్కువగా ఉన్న నగరాలే జాబితాలో టాప్‌లో నిలిచాయి.
ఈ నివేదికలో మిలియన్ డాలర్ల బ్యాలెన్స్ ఉన్న వారే ప్రధానంగా పరిశీలనకు తీసుకున్నారు. వారు కొనుగోలు చేసే ఖరీదైన బ్రాండెడ్ వస్తువులు, యాత్రలు, సేవల వినియోగం ఆధారంగా నగరాల ఖరీదుతనాన్ని కొలిచారు. సింగపూర్‌లో ఈ తరహా జీవనశైలి ఎక్కువగా ఉండటంతో ఖర్చులు గణనీయంగా పెరిగి, మిగతా నగరాల కంటే పైకి వెళ్లింది.
టాప్-10లో ఇతర ప్రముఖ నగరాలు
ఈ నివేదిక ప్రకారం టాప్-10 ఖరీదైన నగరాల్లో షాంఘై, మొనాకో, జ్యూరిచ్, న్యూయార్క్, పారిస్, సావోపాలో, మిలాన్ నగరాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన వ్యాపార, ఫ్యాషన్, టెక్నాలజీ కేంద్రాలు. ఖరీదైన జీవన శైలితో పాటు, అధిక రియల్ ఎస్టేట్ ధరలు, విలాస సేవలు అందుబాటులో ఉండటంతో ఇవి టాప్-10లో నిలిచాయి. ఈ నివేదిక ద్వారా ప్రపంచ మిలియనీర్ల ప్రాధాన్యతలు, ఖర్చుల ధోరణులు స్పష్టంగా తెలుస్తున్నాయి.