బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల సంఘం దేశ 22వ అధ్యక్షుడి పేరును ప్రకటించింది. బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడిగా మాజీ న్యాయమూర్తి, స్వాతంత్య్ర సమరయోధుడు మహ్మద్ షహబుద్దీన్ చుప్పూ (Shahabuddin Chuppu)ని నియమిస్తారని కమిషన్ వెల్లడించింది. సోమవారం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాజీ హబీబుల్ అవల్ ఆదివారం సమర్పించిన నామినేషన్ పత్రాలను పరిశీలించిన తర్వాత అతని పేరును ప్రకటించారు.
అతను ప్రస్తుతం అవామీ లీగ్ సలహా మండలి సభ్యుడు. ఇప్పుడు అతను పార్టీలో తన పదవులను వదిలివేయవలసి ఉంటుంది. ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి అభ్యర్థి లేకపోవడంతో ఆయన అధ్యక్షుడు కావడం ఇప్పటికే ఫిక్సయిపోయింది. బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడి నియామకానికి సంబంధించిన గెజిట్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ సోమవారం విడుదల చేశారు. చుప్పూ బంగ్లాదేశ్ 22వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బంగ్లాదేశ్‌లో సుదీర్ఘకాలంపాటు పనిచేసిన అబ్దుల్ హమీద్ పదవీకాలం ఏప్రిల్ 23తో ముగుస్తుంది. బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం.. ఏ వ్యక్తి అయినా దేశానికి రెండుసార్లు మాత్రమే రాష్ట్రపతి కాగలడు. కాగా, ప్రస్తుత అధ్యక్షుడు హమీద్ నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతికి సోమవారం నాడు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలియజేశారు.
అంతకుముందు, పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉన్న అవామీ లీగ్ పార్టీ, షహబుద్దీన్ చుప్పూను ఉన్నత పదవికి నామినేట్ చేసింది. అదే సమయంలో పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ దేశంలోని అత్యున్నత పదవికి ఎవరినీ నామినేట్ చేయలేదు. ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 24తో ముగియడం గమనార్హం. 350 మంది సభ్యులున్న సభలో ప్రస్తుతం అవామీ లీగ్‌కు 305 సీట్లు ఉన్నాయి. ఈ మెజారిటీ దృష్ట్యా అధ్యక్షుడిగా మహ్మద్ షహబుద్దీన్ చుప్పూ ఎన్నిక ఖరారైంది.
Also Read: Hawaii: వామ్మో.. చావు అంచుకు తీసుకెళ్లిన విమానం… రెప్పపాటులో ఎగిరి!?
మహ్మద్ షహబుద్దీన్ చుప్పూ వాయువ్య పాబ్నా జిల్లాలో జన్మించాడు. అతను 1960ల చివరలో, 1970ల ప్రారంభంలో అవామీ లీగ్ విద్యార్థి, యువజన విభాగానికి నాయకుడు. ఇది మాత్రమే కాదు చప్పు 1971 విముక్తి యుద్ధంలో కూడా పాల్గొని బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు వ్యతిరేకంగా అతని కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్టు 15, 1975న సైనిక తిరుగుబాటులో నిరసన తెలిపి జైలు పాలయ్యాడు. ఆ తిరుగుబాటు కారణంగా అవామీ లీగ్ ప్రభుత్వం కూడా పడిపోయింది. తర్వాత 1982లో దేశ న్యాయ సేవలో చేరారు.
తరువాత, 1996 ఎన్నికలలో అవామీ లీగ్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు చుప్పూ బంగాబంధు హత్య దర్యాప్తు బృందానికి సమన్వయకర్తగా పనిచేశాడు. తర్వాత రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. రాజకీయాల్లో చేరిన తర్వాత అవామీ లీగ్ అడ్వైజరీ కౌన్సిల్‌లో సభ్యుడయ్యాడు. ఇప్పుడు దేశానికి అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలో తన బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. మాజీ న్యాయమూర్తి మహ్మద్ షహబుద్దీన్ చుప్పూకు భార్య రెబెక్కా, ఒక కుమారుడు ఉన్నారు. భార్య రెబెక్కా సుల్తానా ప్రభుత్వ మాజీ సంయుక్త కార్యదర్శి.