సౌదీ అరేబియాలో ప్రయాణీకుల విమానంపై గన్ ఫైరింగ్ (Gunfire) జరిగింది. విమానానికి బుల్లెట్ తగలడంతో గందరగోళం నెలకొంది. విమానంలో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. సౌదీ ప్రభుత్వ ఆధీనంలోని విమానయాన సంస్థ సౌదీయా (Saudia)కు చెందిన ప్యాసింజర్ విమానం సూడాన్ (Sudan) నుంచి సౌదీ అరేబియాకు వెళ్లబోతుండగా ఈ ఘటన జరిగింది. సూడాన్ నుంచి సౌదీ అరేబియాలోని రియాద్‌కు ప్రయాణించాల్సిన విమానంపై శనివారం గన్ ఫైరింగ్ జరిగింది. ఎయిర్ బస్ ఏ330 విమానం పై కాల్పులు జరిగాయని, అందులో ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని ఎయిర్‌లైన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. రియాద్‌కు వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. ప్రయాణికులంతా బోర్డింగ్ అయ్యాక ఈ ఘటన జరిగింది.
ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీశారు. తన ప్రకటనలో విమానయాన సంస్థ ఎటువంటి ప్రాణనష్టం గురించి తెలియజేయలేదు. ఈ మేరకు సౌదీ అరేబియా జాతీయ విమానయాన సంస్థ సౌదియా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకటన ప్రకారం.. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఎయిర్‌బస్ A330 దాని షెడ్యూల్ బయలుదేరే ముందు విమానంపై గన్ ఫైరింగ్ జరిగిందని ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
విమానంలోని క్యాబిన్ సిబ్బంది అంతా సుడాన్‌లోని సౌదీ రాయబార కార్యాలయానికి సురక్షితంగా చేరుకున్నారని ధృవీకరించబడింది. అంతేకాకుండా సూడాన్‌కు వెళ్లే అన్ని ఇతర విమానాలు నిలిపివేయబడ్డాయి. సూడాన్‌లో పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి ఇతర దేశాల విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి.
Also Read: Delhi Liquor Scam: కాకా పుట్టిస్తున్న సుఖేష్ చాట్.. కవిత ఫోన్ నంబర్స్ లీక్
సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య భారీ ఘర్షణలు జరుగుతున్నాయి. సిటీ సెంటర్‌లోని ఖార్టూమ్ విమానాశ్రయంలో ముగ్గురు పౌరులు మరణించారని వైద్యుల సంఘం తెలిపింది. శనివారం ఉదయం సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య ఉద్రిక్తతల మధ్య నిరంతర కాల్పుల శబ్దాలు వినిపించాయి. రాజధాని మధ్య ప్రాంతాలతో పాటు పొరుగు పట్టణమైన బహ్రీలో కూడా తుపాకీ శబ్దాలు వినిపించాయి. ‘రాపిడ్ సపోర్ట్ ఫోర్స్’ (RSF)గా పిలువబడే పారామిలిటరీ దళం,యు సైన్యం మధ్య ఉద్రిక్తత ఇటీవలి నెలల్లో పెరిగింది.
శనివారం ఉదయం విడుదల చేసిన ఒక ప్రకటనలో దక్షిణ ఖార్టూమ్‌లోని బలగాల స్థావరంపై సైన్యం దాడి చేసిందని RSF ఆరోపించింది. ఈ దాడిలో సైన్యం తేలికపాటి, భారీ ఆయుధాలను ఉపయోగించిందని ప్రకటన పేర్కొంది. అయితే ఈ విషయంపై సైన్యం నుంచి తక్షణ స్పందన లేదు. అక్టోబరు 2021లో జరిగిన తిరుగుబాటులో సూడానీస్ మిలటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది మరియు అప్పటి నుండి దేశాన్ని సార్వభౌమ మండలి ద్వారా నడిపిస్తుంది.