Saudi Supports Palestine : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంపై సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ స్పందించారు. పాలస్తీనాకు తన మద్దతును ప్రకటించారు. పాలస్తీనా అధ్యక్షుడు మహ్ముద్ అబ్బాస్ తో తాను మాట్లాడానని వెల్లడించారు. యుద్ధం ఇంకా కొనసాగకుండా నిరోధించడానికి కృషి చేస్తానని తెలిపారు. ‘‘పాలస్తీనా ప్రజలకు మేం అండగా ఉంటాం. వారు గౌరవప్రదంగా జీవించడానికి సహాయం చేస్తాం. చట్టబద్ధమైన హక్కులు లభించేలా చేస్తాం. వారి ఆశలు ఆకాంక్షలు నెరవేరేందుకు సహకారం అందిస్తాం. న్యాయమైన శాశ్వత శాంతిని సాధించడానికి వారికి అండగా ఉంటాం’’ అని మహ్మద్ బిన్ సల్మాన్ వెల్లడించారు. ఈవిషయంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా, జోర్డాన్ రాజు అబ్దుల్లాతో కూడా మాట్లాడానని సౌదీ యువరాజు తెలిపారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ లలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆలస్యంగా సౌదీ యువరాజు స్పందించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
శనివారం నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్, పాలస్తీనాలలో ఇప్పటికే 1600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ వైపు 900 మంది, గాజా వైపు 700 మంది చనిపోయారు. అయితే ఇజ్రాయెల్ సోమవారమే గాజా సీజ్ ను ప్రకటించింది. గాజాలో హమాస్ ఉగ్ర స్థావరాలు ఉన్నాయి. ఈ కారణం వల్ల అక్కడున్న 20 లక్షల మంది గాజా ప్రజలకు నీరు, విద్యుత్, వంట గ్యాస్, నిత్యావసరాలు అందకుండా చేస్తామని ఇజ్రాయెల్ అనౌన్స్ చేసింది. ఇందుకోసం గాజా చుట్టూ 3 లక్షల మంది ఇజ్రాయెలీ సైనికులను మోహరించింది. నీరు, నిత్యావసరాలు అందక గాజావాసులు ఎంతో ఇబ్బందిపడుతున్నారు. ఈ తరుణంలో పాలస్తీనాకు సౌదీ అరేబియా మద్దతును ప్రకటించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇరాన్ , ఈజిప్టు, ఖతర్ దేశాలు కూడా పాలస్తీనాకు అండగా నిలుస్తామని తెలిపాయి. ఈనేపథ్యంలో ఈ దేశాలు ఇజ్రాయెల్ తో ఏవిధమైన దౌత్యాన్ని నెరుపుతాయి ? సంక్షోభానికి ఎలాంటి పరిష్కారాన్ని వెతుకుతాయి ? అనేది ఆసక్తికరంగా (Saudi Supports Palestine) మారింది.