Pakistan Beggars : పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా వార్నింగ్ ఇచ్చింది. హజ్ యాత్ర, ఉమ్రా యాత్ర ముసుగులో తమ దేశంలోకి బిచ్చగాళ్లను పంపుతున్నారని పాక్‌పై సౌదీ మండిపడింది. హజ్ యాత్ర పేరుతో సౌదీకి వచ్చేందుకు యత్నించే భిక్షగాళ్లను గుర్తించి అక్కడే ఆపేయాలనని పాకిస్తాన్‌కు సూచించింది. ఒకవేళ ఈ అంశంపై పాకిస్తాన్ సరైన చర్యలు తీసుకోకుంటే.. ఆ దేశం నుంచి హజ్ యాత్రకు వచ్చే వారి విషయంలో తాము కఠిన నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందని సౌదీ స్పష్టం చేసింది. ఈమేరకు పాకిస్తాన్ మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది. ఈ అంశంపై సౌదీ ప్రభుత్వ హజ్ శాఖ నుంచి పాకిస్తాన్ మత వ్యవహారాల శాఖకు సూచనలు అందాయని ఆ కథనంలో ప్రస్తావించారు.
Also Read :China Border : చైనాతో బార్డర్ సమస్యకు 75 శాతం పరిష్కారం దొరికినట్టే : జైశంకర్
సౌదీ హెచ్చరికల నేపథ్యంలో పాకిస్తాన్ ఓ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఉమ్రా చట్టానికి సంబంధించిన ఒక ప్రత్యేక బిల్లును పాకిస్తాన్(Pakistan Beggars) పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఉమ్రా యాత్రలకు సంబంధించిన వీసాల ప్రక్రియను ప్రాసెస్ చేసే ట్రావెల్ ఏజెన్సీలను ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. ఇప్పటివరకు ఈ ట్రావెల్ ఏజెన్సీలపై చట్టపరమైన పర్యవేక్షణ లేదు. ఇకపై వాటిని ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. తమ ప్రభుత్వం అనుమతి లేకుండా హజ్ యాత్రకు వచ్చే వారికి దాదాపు రూ.2.22 లక్షల జరిమానా, శాశ్వత బహిష్కరణ విధిస్తామని ఈ ఏడాది మేలో సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. చాలా మంది అక్రమ మార్గాల్లో హజ్ యాత్రకు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది హజ్ యాత్రలో వందలాది మంది అనధికారికంగా పాల్గొన్నారు. వారు కాలినడకన మక్కా నగరం దాకా ఎడారుల మీదుగా నడుచుకుంటూ వచ్చి అస్వస్థతకు గురయ్యారు. ఇలా ఆరోగ్యం దెబ్బతిన్నవారిలో వంద మందికిపై చనిపోయారు. ఇలాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా ఉండేందుకే హజ్ యాత్రల విషయంలో కఠిన నిబంధనలను సౌదీ సర్కారు అమల్లోకి తెచ్చింది.