Site icon HashtagU Telugu

Modi Strategy on Opposition : ప్రతిపక్షాలపై మోడీ వదిలిన సనాతన ధర్మాస్త్రం

PM Rojgar Mela

Sanatana Dharmastra Left By Modi On The Opposition

By: డా. ప్రసాదమూర్తి

Modi Strategy on Opposition : ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేదు. ఒకరి తర్వాత ఒకరు బిజెపి అధినాయకులు, హిందూ ధర్మ సంస్థల పీఠాధిపతులు పలువురు ఈ అంశం మీద రోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక సందర్భంలో తమ అస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో పర్యటించి రెండు బహిరంగ సభలలో ప్రసంగించిన సందర్భంలో సనాతన ధర్మాస్త్రాన్ని ప్రతిపక్షాల మీద ఎక్కుపెట్టారు. ప్రతిపక్షాలు దేశాన్ని విభజించాలని చూస్తున్నాయని, మరో వేయి సంవత్సరాలు పాటు దేశాన్ని వెనక్కి తీసుకుపోవాలని ప్రయత్నిన్నాయని, దేశాన్ని తిరిగి బానిసత్వంలోకి నెట్టడానికి చూస్తున్నాయని ప్రధాని సనాతన ధర్మం గురించి ప్రస్తావిస్తూ చాలా తీవ్రమైన పదజాలంతో విపక్షాల మీద విరుచుకుపడ్డారు.

మధ్యప్రదేశ్ లోని బీనాలో, చత్తీస్ గఢ్ లోని రాయగడలో ఆయన దాదాపు 50 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో ప్రధాని ప్రసంగిస్తూ ఎక్కువ సమయాన్ని ప్రతిపక్షాల మీద విమర్శనా బాణాలను ఎక్కుపెట్టడానికి కేటాయించారు. ఈ విమర్శల్లో ప్రధానంగా సనాతన ధర్మం గురించి ఆయన ప్రస్తావించడాన్ని జాతీయ మీడియా ప్రముఖంగా పేర్కొంది. ఇది చూస్తుంటే బిజెపి అధినాయకత్వం ధర్మపరమైన మతపరమైన అంశాలను ప్రధానంగా చేసుకొని ఎన్నికలలో విజయం సాధించడానికి ప్రయత్నాలు చేయడం ఏమాత్రం తగ్గించలేదని అర్థమవుతోంది. ఉదయనిధి స్టాలిన్ ప్రగతిశీల రచయితల సమావేశంలో సనాతన ధర్మానికి సంబంధించిన అంశం మీద మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు, కేవలం అతనికి సంబంధించినవి మాత్రమే. ఆ వ్యాఖ్యలను మొత్తం ప్రతిపక్షాల కూటమికి అంటగట్టాలని, తద్వారా లబ్ధి పొందాలని బిజెపి వారి ప్రయత్నాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మమతా బెనర్జీతో సహా పలువురు ప్రతిపక్షాల నాయకులు సనాతన ధర్మం మీద ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయంగా పేర్కొని, ఆ వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

అయినా మాటిమాటికి బిజెపి వర్గాలు సనాతన ధర్మం మీద చర్చను చల్లారకుండా నిత్యం రగులుస్తూ రగులుస్తూ ఎన్నికల వరకూ తీసుకువెళ్లాలని ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రధాని గురువారం నాడు త్వరలో ఎన్నికలు జరగబోతున్న మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లోపర్యటించారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనే ఉద్దేశ్యమైనా, అది ఎన్నికల పర్యటనే. ఎన్నికలకు ముందు పాలకపక్షం తాము చేసే పనులను, చేసిన పనులను ప్రజల ముందు ఉంచి ఓటు అడగాలి. చేయబోయే పనులను కూడా ప్రజలకు తెలియజెప్పాలి. కానీ కేంద్రంలో అధికార పార్టీ నాయకులు మాత్రం ప్రజలను మతపరమైన అంశాల మీదే దృష్టి కేంద్రీకరించేలా చేసి రాజకీయంగా ప్రయోజనాలు పొందాలని మాత్రమే చూస్తున్నారన్న అనుమానాలు కలిగిస్తున్నారు. ఎన్నికల అనుభవాలు దేశానికి చాలా ఉన్నాయి కదా. అయితే ఎప్పుడూ ఇలాంటి వ్యూహాలు పనిచేయవు. కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ది కేరళ స్టోరీ సినిమా వివాదాన్ని తీసుకువచ్చి ఓటర్లను ఆకర్షించాలని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీయే ప్రయత్నించిన సందర్భాలు మర్చిపోలేం. కానీ కర్ణాటక ఓటర్లు మతపరమైన అంశాలను పక్కనపెట్టి అభివృద్ధి, ప్రజాసంక్షేమం మొదలైన అంశాలకే పట్టం కట్టారు.

కాబట్టి దేశం రాను రాను మతపరమైన అంశాల కంటే ప్రజానుకూల అభివృద్ధికరమైన అంశాల పైనే దృష్టి పెడుతుందని మనకు అర్థమవుతోంది. ఇది ఏలిన వారికి అర్థం కావాలి కదా. సనాతన ధర్మం అనేది కుల ధర్మంతో ముడిపడి ఉన్న విషయం. ఇది వేల సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతున్న ఘర్షణకు సంబంధించిన వివాదం. అందుకే ప్రధానమంత్రి మోడీ తెలివిగా దళితుడైన సంత్ రవిదాస్ గురించి కూడా ప్రస్తావిస్తూ ఆయన బోధనలు ఆధారంగా మహాత్మా గాంధీ అస్పృశ్యతా సమస్యను పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలను గుర్తు చేశారు. ఇలా ఏమి చేసినా, ఏమి చెప్పినా ధార్మికమైన మతపరమైన అంశాలను ఎన్నికల ఎజెండాగా మార్చుకుంటే అవి అంత గొప్ప ఫలితాలను ఇవ్వవని కర్ణాటక అనుభవం చెప్పనే చెప్పింది. ఆ అనుభవంతో మరి పాఠాలు నేర్చుకుంటారో.. విపరీత ఫలితాలని కోరి తెచ్చుకుంటారో చూడాలి. ఏది ఏమైనా సనాతన ధర్మాస్త్రం బిజెపి వారి అమ్ముల పొదిలో ఇప్పుడు చాలా కీలకమైన అస్త్రంగా మారిందని చెప్పాలి.

Also Read:  Chandrababu : చంద్రబాబు అరెస్టు పరిణామాలపై కేంద్ర హోంశాఖకు ఎన్ఎస్‌జీ నివేదిక