Nuclear Weapons : అమెరికా, పశ్చిమ దేశాలపై రష్యా సంచలన ఆరోపణలు చేసింది. అణ్వస్త్రాలను నేరుగా ఉక్రెయిన్ చేతికి అందించి.. ఓ భారీ యుద్ధాన్ని చేయించే ప్లాన్‌లో ఆ దేశాలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు, ఆ దేశ భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రీ మెద్వెదేవ్ ఆరోపించారు. ప్రపంచంలోని చాలా మంది జీవితాలను బలితీసుకునేందుకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ బరితెగించారని ఆయన మండిపడ్డారు. ఒకవేళ ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు చేరితే.. దాన్ని కూడా రష్యాపై అమెరికా దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని మెద్వెదేవ్ స్పష్టం చేశారు.
Also Read :Mumbai Terror Attack: 26/11 ఉగ్రదాడికి 16 ఏళ్లు.. ఆ రోజు ముంబైలో ఏం జరిగిందంటే..
‘‘ఉక్రెయిన్ నుంచి రష్యాపైకి అణ్వాయుధాలను(Nuclear Weapons) ప్రయోగిస్తే.. మా దేశ కొత్త అణువిధానం ప్రకారం అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ఆయన హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలను అందించే అంశంపై ఇటీవలే అమెరికా, ఐరోపా దేశాల మధ్య చర్చలు జరిగాయంటూ న్యూయార్క్ టైమ్స్‌లో సంచలన కథనం ప్రచురితమైంది. దాని ఆధారంగా ఇప్పుడు మెద్వెదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read :Blood Pledge : ‘‘చోరీ చేస్తే సూసైడ్’’.. ఉద్యోగులతో సంతకాలు చేయించుకున్న బ్యాంక్
గత కొన్నివారాల వ్యవధిలో బ్రిటన్ నుంచి పెద్దసంఖ్యలో స్ట్రామ్ షాడో మిస్సైళ్లు ఉక్రెయిన్‌కు సప్లై అయినట్లు తెలుస్తోంది. తాము అందించే లాంగ్ రేంజ్ మిస్సైళ్లను రష్యాపైకి ప్రయోగించేందుకు ఇటీవలే ఉక్రెయిన్‌కు అమెరికా, బ్రిటన్‌లు అనుమతి మంజూరు చేశాయి. అప్పటి నుంచి లాంగ్ రేంజ్ మిస్సైళ్లతోనూ రష్యాపై ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. ఈ పరిణామంతో రష్యా ఆగ్రహంగా ఉంది. ఉక్రెయిన్ తీరు మారకుంటే.. దానికి పశ్చిమ దేశాల మద్దతు కొనసాగితే.. అణ్వాయుధాల ప్రయోగంపై పుతిన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు.
డ్రోన్లతో భారీ దాడి
సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఉక్రెయిన్‌పైకి రష్యా డ్రోన్లతో పెద్దఎత్తున దాడులకు పాల్పడింది. ఈ స్వల్ప వ్యవధిలో ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాలపై దాడి కోసం దాదాపు 188 రష్యా డ్రోన్లు వెళ్లాయి. అయితే వాటిలో 76 డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ద్వారా గగనతలంలోనే కూల్చేశామని ఉక్రెయిన్ వెల్లడించింది. మరో 96 రష్యా డ్రోన్లను ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ టెక్నిక్‌లతో ఉక్రెయిన్ ఆర్మీ దారి మళ్లించినట్లు తెలుస్తోంది.