Nuclear Weapons : అమెరికాకు షాక్ ఇచ్చే కీలకమైన ఫైల్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ సంతకం చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న ఏదైనా దేశం సాయంతో.. ఏ దేశమైనా రష్యాపై ఎటాక్ చేస్తే.. దాన్ని ఆ రెండుదేశాల మూకుమ్మడి దాడిగా పరిగణిస్తామని ఆ ఫైల్‌లో ప్రస్తావించారు. మూకుమ్మడి దాడిలో పాల్గొనే దేశాలపైకి బలమైన ప్రతిదాడి చేసే హక్కును రష్యా పొందుతుందని ఆ ఫైల్‌లో పొందుపరిచారు. ఒకవేళ పశ్చిమదేశాలు (నాటో) రష్యాపై మూకుమ్మడి దాడులకు దిగితే.. మరో ఆలోచన లేకుండా వాటిపైకి అణ్వాయుధాలను ప్రయోగించేలా నిబంధనలను సవరించినట్లు తెలుస్తోంది. ఈమేరకు సంచలన సవరణలతో రష్యా తన అణ్వాయుధాల వినియోగ సిద్ధాంతాన్ని సవరించింది. తాము అందించే లాంగ్ రేంజ్ మిస్సైళ్లను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఇటీవలే ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతులు మంజూరు చేసింది. ఈ తరుణంలో పుతిన్ తాజా నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలై 1000 రోజులు పూర్తయిన వేళ ఈ ఫైలుపై పుతిన్ సంతకం చేయడం గమనార్హం.
Also Read :Mens Day 2024 : కవితను చదివి వినిపించిన మహేశ్ బాబు.. ‘మెన్స్ డే’ ప్రత్యేక పోస్ట్
కొన్ని రోజుల క్రితం పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాపైకి ఒకవేళ లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ఉక్రెయిన్ ప్రయోగిస్తే.. దాన్ని నాటో, అమెరికా, ఐరోపా దేశాల దాడికి భావిస్తామని ఆయన (Nuclear Weapons) స్పష్టం చేశారు. ఆయా దేశాలు కూడా ఉక్రెయిన్‌తో కలిసి యుద్ధ రంగంలోకి ప్రవేశించినట్లుగా పరిగణించి ప్రతిదాడులను మొదలుపెడతామని పుతిన్ తేల్చి చెప్పారు. అటువంటి పరిస్థితే వస్తే.. నాటో సైనిక స్థావరాలపై దాడులు చేసేందుకు వెనుకాడబోమని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్‌కు ఏదైనా దేశం భారీ స్థాయి, అత్యధిక సామర్థ్యం కలిగిన ఆయుధాలను అందించి.. రష్యాపై దాడులు చేయిస్తే ఏం చేయాలనే దానిపై తమ వద్ద స్పష్టమైన వ్యూహాలు ఉన్నాయని పుతిన్ పేర్కొన్నారు.