Site icon HashtagU Telugu

Taliban : తాలిబాన్ ప్రభుత్వానికి రష్యా అధికార గుర్తింపు.. అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు

Taliban

Taliban

Taliban : ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాదాపు మూడేళ్ల తర్వాత, రష్యా వారిని అధికారికంగా గుర్తించిన మొదటి గొప్ప దేశంగా మారింది. ఇప్పటి వరకు ఒక్క దేశం కూడా తాలిబాన్ల పాలనను గుర్తించలేదు. ఈ నేపథ్యంలో మాస్కో తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా విస్తృత చర్చకు దారితీసింది.

తాలిబాన్ ప్రభుత్వం నియమించిన కొత్త ఆఫ్ఘన్ రాయబారి గుల్ హసన్ హసన్‌కు అధికార గుర్తింపును రష్యా ప్రకటించింది. రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రే రుడెంకో ఆయన నుండి అధికార పత్రాలు స్వీకరించారు. దీని ఆధారంగా రష్యా విదేశాంగ శాఖ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అంతేకాదు, మాస్కోలోని ఆఫ్ఘన్ ఎంబసీ భవనంపై ఉన్న మునుపటి ప్రభుత్వ జెండాను తొలగించి, తాలిబాన్ తెల్ల జెండాను ఎగురవేశారు.

ఈ పరిణామంతో రష్యా-ఆఫ్ఘన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిజ్యం, ఇంధనం, రవాణా, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారం పెరిగే అవకాశం ఉందని రష్యా పేర్కొంది. తమ ప్రభుత్వానికి రష్యా ఇచ్చిన ఈ గుర్తింపును తాలిబాన్ హర్షంగా స్వీకరించింది. ఇది ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక పెద్ద విజయంగా తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాకి వ్యాఖ్యానించారు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2021 ఆగస్టులో తాలిబాన్లు కాబూల్‌ను ఆక్రమించినప్పటి నుంచీ రష్యా ఎంబసీను మూసివేయలేదు. సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది. అయితే మానవ హక్కుల పరిరక్షణ అంశాల్లో తాలిబాన్ పట్ల అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో, రష్యా తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది.

Nara Lokesh : వైఎస్సార్ కాంగ్రెస్ కుట్రలు విఫలం.. మెగా డీఎస్సీ విజయవంతం