Ukraine War: ఉక్రెయిన్ నుంచి రష్యా పీచే ముడ్.. చేజారిన కీలక నగరం!!

రష్యాకు మరో పెద్ద షాక్‌.. ఉక్రెయిన్‌ లోని ఖార్కివ్ ప్రావిన్స్‌లో ఉన్న కీలక నగరం ఇజియంను రష్యా కోల్పోయింది.

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 07:45 AM IST

రష్యాకు మరో పెద్ద షాక్‌.. ఉక్రెయిన్‌ లోని ఖార్కివ్ ప్రావిన్స్‌లో ఉన్న కీలక నగరం ఇజియంను రష్యా కోల్పోయింది. దీన్ని మళ్ళీ ఉక్రెయిన్‌ సైన్యం పోరాడి స్వాధీనం చేసుకుంది.దీంతో రష్యా సైనికులు తమ ఆయుధాలు, ట్యాంకులు, మందుగుండును వదిలి ఆ నగరం నుంచి పారిపోయారు. మార్చిలో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి రష్యా సైన్యం వెనుదిరిగిన తర్వాత.. రష్యాకు ఇది మరో పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.

రష్యా మరో మాట..

రష్యా దళాలు ఇప్పటివరకు ఇజియం నగరాన్ని లాజిస్టిక్స్ బేస్‌గా ఉపయోగించాయి. డోనెట్‌స్కీ, లుహాన్‌స్కీతో పాటు పక్కనే ఉన్న డాన్‌బాస్‌ నగరానికి ఉత్తరంగా ఉన్న ఈ ప్రాంతంలో కొన్ని నెలలుగా రష్యా సైన్యం మకాం వేసింది. అయితే ఉక్రెయిన్‌ దళాలు పురోగమించడంతో ఈ నగరాన్ని రష్యా కోల్పోయింది. అయితే ఈ వాదనతో రష్యా విభేదిస్తోంది. డోనెట్‌స్కీతోపాటు ఇతర ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలను పటిష్టం చేయడం కోసం ఇజియం పరిసర ప్రాంతాల నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. ” ఇజియం ప్రాంతంలోని నివాసితులు ప్రాణ రక్షణకు రష్యా భూభాగంలోకి రావాలని రష్యా అధికారులు సూచించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాన్ని వీడి, రష్యా సరిహద్దుల్లోకి వస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది.” అని రష్యా మీడియా కథనాలు ప్రచురించింది.

జెలెన్‌స్కీ వ్యాఖ్య..

ఈ పరిణామాలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఒక ప్రకటన విడుదల చేశారు. ” మా దళాలు ఎంతో పురోగతి సాధించాయి.
రష్యన్ సైన్యం ఇటీవల వెన్ను చూపుతోంది. మా సైన్యం ఎంతో పురోగతి సాధిస్తోంది. 2,000 చదరవు కిలోమీటర్ల భూభాగాన్ని మా సైన్యం రష్యా ఆర్మీ నుంచి తిరిగి దక్కించుకుంది” అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.