Site icon HashtagU Telugu

Robert F Kennedy : అమెరికా అధ్యక్ష రేసులోకి కెనెడీ కుటుంబీకుడు.. ఎవరాయన ?

Robert Kennedy

Robert Kennedy

Robert F Kennedy : 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం మరో కొత్త ముఖం తెరపైకి వచ్చింది. ఆ అభ్యర్థి సామాన్యుడేం కాదు. అమెరికా దివంగత, మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీకి స్వయానా మేనల్లుడు. ఆయన పేరే రాబర్ట్ ఎఫ్. కెనెడీ జూనియర్. ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఈయన డెమొక్రాటిక్ పార్టీ తరఫున  అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం గట్టిగా ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ఛాన్స్ దొరకకపోవచ్చని తెలియడంతో.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఫిలడెల్ఫియాలో జరిగిన ఒక ర్యాలీలో ఈవిషయాన్ని రాబర్ట్ ఎఫ్ కెనెడీ ప్రకటించారు. ‘‘మా నాన్న జోసెఫ్ కెనెడీ, మా మామ జాన్ ఎఫ్ కెనెడీ ప్రాతినిధ్యం వహించిన డెమొక్రాటిక్ పార్టీకి దూరం అవుతున్నందుకు చాలా బాధగా ఉంది. నేను ఇక ఈ పార్టీల నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకుంటున్నాను. ఇకపై అమెరికా ప్రజలతోనే ఉంటాను’’ అని ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు.

We’re now on WhatsApp. Click to Join

వ్యతిరేకిస్తూ తోబుట్టువుల సంయుక్త  ప్రకటన 

రాబర్ట్ ఎఫ్ కెనెడీకి ఆయన సొంత ఫ్యామిలీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. రాబర్ట్ ఎఫ్ కెనెడీకి మరో 10 మంది తోబుట్టువులు ఉన్నారు. మొత్తం 11 మంది సంతానంలో మూడో వ్యక్తి రాబర్ట్ ఎఫ్ కెనెడీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే రాబర్ట్ ఎఫ్ కెనెడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తోబుట్టువులలో నలుగురు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. దీనిపై సంతకం చేసిన వారిలో.. ఆయన  సోదరుడు జోసెఫ్ పి.కెనెడీ II, ముగ్గురు సోదరీమణులు కాథ్లీన్ కెనెడీ టౌన్‌సెండ్ (మేరీల్యాండ్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్) , కెర్రీ కెన్నెడీ, రోరీ కెన్నెడీ ఉన్నారు. ‘‘జో బైడెన్ పై స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయాలని మా సోదరుడు రాబర్ట్  తీసుకున్న నిర్ణయం మన దేశానికి ప్రమాదకరం.  రాబర్ట్ మా నాన్నగారి పేరునే పంచుకున్నాడు. కానీ మా నాన్న ఇచ్చిన విలువలను పంచుకోలేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

వ్యాక్సిన్లతో ముప్పు అని.. 

రాబర్ట్ ఎఫ్.కెనెడీ కరోనా టైంలో వ్యాక్సినేషన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్లతో చాలా ముప్పు ఉందని హెచ్చరించారు. వ్యాక్సిన్లు తీసుకోవద్దనే ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. కొన్ని వ్యాక్సిన్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు డెమొక్రాటిక్ పార్టీ నేతలు ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తూ.. ఇటువంటి వ్యక్తి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి సరిపోడని (Robert F Kennedy) మండిపడుతున్నారు.

Also read : Dengue Infection: గర్భధారణ సమయంలో డెంగ్యూ చాలా ప్రమాదకరం.. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!