బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించిన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్.. మంగళవారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ అధికారిక సంప్రదాయాల ప్రకారం రాజు చార్లెస్-3 అనుమతి తీసుకున్న అనంతరం ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేశారు. అనంతరం 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఆయన మాట్లాడుతూ.. బ్రిటన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. కోవిడ్ -19 పరిణామాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాల కొరతను సృష్టించిందని ఆయన అన్నారు.
ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే తన లక్ష్యమని ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. ‘‘పారదర్శక పాలన అందిస్తా. అనుకుంటే మనం అద్భుతాలు సాధించగలం. బ్రిటన్ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను అధిగమిస్తాం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా’’ అని వెల్లడించారు. యూకే ప్రజల ఉన్నతి కోసం రాత్రింబవళ్లు పనిచేస్తామని ప్రధాని రిషి సునాక్ వెల్లడించారు.
‘‘కన్జర్వేటివ్ పార్టీ ప్రతిదశలో జవాబుదారీతనంతో పనిచేస్తుంది. అందరితో కలిసి దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. పర్యావరణ పరిరక్షణకు మా వంతు కృషి చేస్తాం. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని రిషి సునాక్ పేర్కొన్నారు. 45 రోజుల పాటు ప్రధాని పదవిలో ఉన్న తర్వాత లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.