Site icon HashtagU Telugu

Rishi Sunak: బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక లాంఛనమే

Rishi Sunak

బ్రిటన్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాని పదవి రేసు దాదాపు ఏకపక్షంగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌.. బ్రిటన్ కొత్త ప్రధాని కావడం దాదాపు ఖాయమైంది. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ ప్రకటించడంతో రిషి సునాక్ బాధ్యతలు చేపట్టడం లాంథనమే. వాస్తవానికి బ్రిటన్​ ప్రధాని రేసు ముగ్గురు మధ్య ఉంటుందని అందరు భావించారు. అందుకు తగ్గట్టుగానే మాజీ ప్రధాని బోరిస్​ జాన్సన్​ సైతం పావులు కదిపారు. అయితే అనూహ్యంగా రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి షాకిచ్చారు.

పార్టీ సభ్యుల మద్ధతు ఉందని స్పష్టం చేసిన బోరిస్ జాన్సన్ ఐకమత్యం లేకపోతే.. పదవి దక్కినా లాభం లేదంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక రేసులో మిగిలి ఉన్న పెన్నీ మోర్డాంట్‌కు కేవలం 29 మంది ఎంపీల మద్దతే ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం 100 మంది ఎంపీల సపోర్ట్ లేకుండా ఆమె పోటీ చేయడం సాధ్యం కాదు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా ఆమె 100 మంది సభ్యుల మద్దతు ఉందని నిరూపించుకోలేకపోతే.. 142 మంది సభ్యుల మద్దతున్న రిషి సునాక్‌ ప్రధాని అవుతారు. దీంతో బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. రిషి సునాక్‌.. భారత ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు. ఇదిలా ఉంటే బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత రిషి సునాక్​ ప్రధాని రేసులో దూసుకెళ్లినా చివర్లో వెనుకబడిపోయారు. దీంతో లిజ్​ ట్రస్​ బ్రిటన్​ ప్రధానిగా సెప్టెంబర్​ తొలి వారంలో బాధ్యతలు స్వీకరించారు. అయితే పన్ను వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా సొంత పార్టీలోనే ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 45 రోజుల పదవీకాలం తర్వాత లిజ్ ట్రస్ రాజీనామా చేశారు.