Submarine Cable : ఎర్ర సముద్రం గర్భంలో కీలకమైన సబ్‌మరైన్ కేబుల్స్ తెగిపోవడంతో మధ్య ప్రాచ్య దేశాలతో పాటు పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన కారణంగా పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి దేశాల్లో ఇంటర్నెట్ వేగం గణనీయంగా మందగించిందని, డిజిటల్ కార్యకలాపాలు స్తంభించాయని అంతర్జాతీయ ఇంటర్నెట్ వాచ్‌డాగ్ సంస్థ ‘నెట్‌బ్లాక్స్’ తన అధికారిక ప్రకటనలో ధృవీకరించింది. సౌదీ అరేబియాలోని జెడ్డా తీరానికి సమీపంలో ఈ కేబుల్స్ ఛిద్రమైనట్లు నిపుణులు గుర్తించారు.
సముద్ర గర్భంలో అత్యంత కీలకమైన ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఎలా తెగిపోయాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఈ ఘటన వెనుక యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ హస్తం ఉందనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. గాజాలో హమాస్‌పై ఇజ్రాయేల్ చేస్తున్న సైనిక చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హౌతీలు, ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే దేశాలపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే ఈ దాడికి పాల్పడి ఉంటారని అంతర్జాతీయ విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఇజ్రాయెల్‌కు సహకరించే నౌకలను ఎర్ర సముద్రంలో లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన హౌతీలు, ఇప్పుడు ప్రపంచ డిజిటల్ మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం ద్వారా తమ నిరసనను మరో స్థాయికి తీసుకెళ్లారని భావిస్తున్నారు. అయితే, గతంలో తమపై వచ్చిన ఇలాంటి ఆరోపణలను హౌతీ రెబల్స్ తీవ్రంగా ఖండించారు. కానీ, తాజా ఘటనపై వారి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Mumbai : చెత్త ఏరిన సీఎం భార్య, స్టార్ హీరో
ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలను కలిపే అంతర్జాతీయ డేటా ట్రాఫిక్‌లో ఎర్ర సముద్రం ఒక కీలకమైన మార్గం. ప్రపంచంలోని ఇంటర్నెట్ డేటాలో దాదాపు 17% ఈ మార్గం గుండానే ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఈ మార్గంలోని కీలక కేబుల్స్ దెబ్బతినడంతో సౌదీ అరేబియా, యూఏఈ, పాకిస్థాన్, జిబౌటి వంటి అనేక దేశాల్లోని ఇంటర్నెట్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, వాణిజ్య కార్యకలాపాలు, కమ్యూనికేషన్ సేవలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
సముద్ర గర్భంలో తెగిపోయిన కేబుల్స్‌ను మరమ్మతు చేయడం అత్యంత సంక్లిష్టమైన, సమయం తీసుకునే ప్రక్రియ. ప్రత్యేక నౌకలు, నిపుణుల బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని పనులు చేపట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎర్ర సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నందున, మరమ్మతు పనులకు మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో ప్రపంచ దేశాల ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల భద్రత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
BRS : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ జోరు..రాష్ట్ర పర్యటనలకు సిద్ధమవుతున్న కేటీఆర్