Qatar – Hamas – Israel : ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఖతర్ రాయబారం.. కొత్త అప్ డేట్స్

Qatar - Hamas - Israel : ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన తాలిబాన్లు, అమెరికా మధ్య చర్చల్లో కీలక పాత్ర పోషించిన ఖతర్ మళ్లీ రంగంలోకి దిగింది.

  • Written By:
  • Publish Date - October 10, 2023 / 08:16 AM IST

Qatar – Hamas – Israel : ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన తాలిబాన్లు, అమెరికా మధ్య చర్చల్లో కీలక పాత్ర పోషించిన ఖతర్ మళ్లీ రంగంలోకి దిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ – హమాస్ మధ్య రాయబారం నడిపేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. శనివారం ఇజ్రాయెల్ పై హమాస్ రాకెట్ దాడులు చేసిన తర్వాతి నుంచే ఈ ప్రక్రియను ఖతర్ మొదలుపెట్టింది. ఖతరే ఎందుకీ చొరవ తీసుకుంటోంది అంటే.. హమాస్ రాజకీయ కార్యకలాపాల అంతర్జాతీయ ఆఫీసు దాదాపు గత పదేళ్లుగా ఖతర్ లోనే ఉంది.  హమాస్ పాలిస్తున్న గాజా ప్రాంతంలో మానవ సహాయ కార్యక్రమాల కోసం ఖతర్ ప్రతి సంవత్సరం విరివిగా విరాళాలు ఇస్తోంది. హమాస్ లోని కీలక నేతలతో ఖతర్ పాలకులు నిత్యం టచ్ లో ఉన్నారు. అందుకే ఇప్పుడు పశ్చిమాసియాలో ఖతర్ రాయబారం చాలా కీలకంగా మారింది.

We’re now on WhatsApp. Click to Join

ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న 36 మంది పాలస్తీనా మహిళలు, పిల్లలను విడిచిపెడితే.. తమ దగ్గరున్న ఇజ్రాయెలీ బందీలను అందరినీ వదిలేస్తామని హమాస్ షరతు పెట్టిందని ఖతర్ ప్రభుత్వ వర్గాలు చెప్పాయంటూ కథనాలు వస్తున్నాయి. అయితే దీన్ని ఇజ్రాయెల్ ఇంకా ధ్రువీకరించలేదు. ఎలాంటి చర్చలే జరగడం లేదని ఇజ్రాయెల్ అంటోంది. ఖతర్ విదేశాంగ శాఖ మాత్రం హమాస్, ఇజ్రాయెల్ అధికారులతో తాము చర్చలు జరుపుతున్నామని అధికారికంగా ప్రకటించింది. ఖైదీల మార్పిడి అంశం ఇందులో ప్రధానంగా ఉందని తెలిపింది. శనివారం రాత్రి నుంచి తాము అమెరికాతోనూ సమన్వయం చేస్తున్నామని, చర్చలు సానుకూల దశలోనే ఉన్నాయని ఖతర్ పేర్కొంది. ‘‘రక్తపాతాన్ని అంతం చేయడం మా లక్ష్యం. ఖైదీలను, బందీలను విడుదల చేయించడం మా ప్రాధాన్యం. ఇజ్రాయెల్ – హమాస్ ఘర్షణ ప్రాంతీయ యుద్ధంగా మారకుండా చూడటంపై మా ఫోకస్ (Qatar – Hamas – Israel)  ఉంది’’ అని ఖతర్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మజేద్ అల్ అన్సారీ చెప్పారు.

రాయబారానికి ఖతరే బెటర్.. ఎందుకు ?

అయితే గాజాకు హమాస్ ఉగ్రవాదులు తీసుకెళ్లిన ఇజ్రాయెల్ బందీల సంఖ్య ఎంత ? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.దానిపై క్లారిటీ వచ్చాకే.. ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీల విడుదలపై క్లారిటీ రానుంది. ఈ పరిస్థితులపై స్పందించిన ఈజిప్టు.. తాము కూూడా హమాస్‌ తో చర్చలు జరిపేందుకు సిద్ధమే అని ప్రకటించింది. తమ దగ్గరున్న ఇజ్రాయెలీ బందీలను సురక్షితంగా ఉంచాలని హమాస్ కు సూచించింది. అయితే ఈజిప్టుతో పోల్చుకుంటే ఖతర్ ఈవిషయంలో బెటర్ విదేశాంగ వ్యవహారాల నిపుణులు అంటున్నారు. గతంలోనూ హమాస్, ఇజ్రాయెల్ మధ్య రాయబారం నడిపిన అనుభవం ఖతర్ కు ఉందని గుర్తు చేస్తున్నారు. హమాస్ ముఖ్య నేతలతో ఖతర్ కు మంచి కమ్యూనికేషన్ ఉందని అంటున్నారు. హమాస్ అధికార స్థావరం గాజాలో ఉన్నప్పటికీ.. దాని ముఖ్య నాయకులు ఖతర్‌తో పాటు ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉన్నారు.

Also read : 1 killed : పాయ‌క‌రావుపేట‌లో విషాదం.. పాఠశాల గోడ కూలి 8 ఏళ్ల బాలుడు మృతి