Putin : రష్యా రక్షణ మంత్రి ఔట్.. పుతిన్ సంచలన నిర్ణయం

Putin : ఉక్రెయిన్‌తో గత రెండేళ్లుగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Putin

Putin

Putin : ఉక్రెయిన్‌తో గత రెండేళ్లుగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ రక్షణ మంత్రి సెర్గీ షోయిగును పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో కొత్త రక్షణ మంత్రిగా మాజీ ఉప ప్రధాని ఆండ్రీ బెలౌసోవ్‌ను పుతిన్ నియమించారు. షోయిగుకు రష్యా భద్రతా మండలి కార్యదర్శిగా బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు పుతిన్ కార్యాలయం ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. బలమైన రష్యాను పునర్ నిర్మించాలనే సంకల్పంతోనే బెలౌసోవ్‌కు రక్షణ శాఖ బాధ్యతలను పుతిన్ అప్పగించారని తెలిపింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ను కూడా మారుస్తారని జరుగుతున్న ప్రచారంపైనా క్రెమ్లిన్ స్పందించింది. లావ్రోవ్ తన పదవిలో కొనసాగుతారని స్పష్టం చేసింది. రష్యా రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆండ్రీ బెలౌసోవ్‌ గతంలో దేశ ఆర్థిక మంత్రిగానూ సేవలందించారు. పుతిన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఆయన కూడా ఒకరు. యుద్ధ పరమైన విషయాల కంటే ఆర్థిక పరమైన అంశాల్లో బెలౌసోవ్‌కు అపారమైన అనుభవం ఉంది. రష్యాకు సంబంధించిన డ్రోన్ తయారీ ప్రోగ్రామ్‌ను పర్యవేక్షించడంలో బెలౌసోవ్ గతంలో కీలక పాత్ర పోషించారు.

We’re now on WhatsApp. Click to Join

రష్యా రక్షణమంత్రిని మార్చడంపై క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మీడియాకు వివరణ ఇచ్చారు. ‘‘1980వ దశకంలో సోవియట్ యూనియన్ ఎదుర్కొన్న పరిస్థితులే ఇప్పుడు రష్యాకు ఎదురయ్యే ముప్పు ఉంది. రష్యా ప్రభుత్వం ఏటా చేసే వ్యయంలో దాదాపు 7.4శాతం సైన్యం, ఇతర భద్రతా బలగాలు, పోలీసుల నిర్వహణకే వెళ్తుంది. వాటికి సంబంధించిన ఖర్చు దేశం ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకోసమే ఆర్థిక నిపుణుడైన బెలౌసోవ్‌కు రక్షణశాఖ బాధ్యతలను పుతిన్ అప్పగించారు’’ అని వెల్లడించారు. ఆవిష్కరణలకు, కొత్త దనానికి సిద్ధంగా ఉండేవాళ్లే యుద్ధభూమిలో విజయం సాధిస్తారని తెలిపారు. కాగా, 2012 సంవత్సరం నుంచి రష్యా రక్షణ మంత్రిగా షోయిగు ఉన్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి ప్రణాళిక రచించింది ఈయనే. ఆ యుద్ధం ఇంకా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో  షోయిగును రక్షణ మంత్రి పదవి నుంచి పుతిన్ తప్పించడం అందరినీ ఆశ్చర్యపర్చింది. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ షోయిగు అమలు చేసిన కొన్ని వ్యూహాలు సరిగ్గా లేవనే అభిప్రాయానికి పుతిన్ (Putin)  వచ్చారని, అందుకే ఆయనను పదవి నుంచి తప్పించారని తెలుస్తోంది.

Also Read : Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు

  Last Updated: 13 May 2024, 09:48 AM IST