Prince Harry: మొదటిసారి ఆ విషయంపై కోర్టు మెట్లెక్కిన ప్రిన్స్ హ్యారీ.. అసలేం జరిగిందంటే?

గతంలో ఎన్నడూ లేనివిధంగా బ్రిటన్ రాజ కుటుంబంలో ఒక ఊహించని చరిత్రలోనే ఒక కొత్త చోటు చేసుకుంది. దాదాపు 130 ఏళ్లలో మొదటిసారిగా ఈ రాజ కుటుంబానికి

  • Written By:
  • Publish Date - June 6, 2023 / 05:04 PM IST

గతంలో ఎన్నడూ లేనివిధంగా బ్రిటన్ రాజ కుటుంబంలో ఒక ఊహించని చరిత్రలోనే ఒక కొత్త చోటు చేసుకుంది. దాదాపు 130 ఏళ్లలో మొదటిసారిగా ఈ రాజ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి కోర్టుకు హాజరయ్యారు. అది ఫోన్‌ హ్యాకింగ్‌కు సంబంధించిన కేసులో హాజరయ్యారు. ఒక వార్తా సంస్థకు వ్యతిరేకంగా కింగ్‌ ఛార్లెస్‌ 3 రెండో తనయుడు ప్రిన్స్‌ హ్యారీ కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పారు. బ్రిటన్‌కు చెందిన మిర్రర్‌ గ్రూప్‌ అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగా నూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి.

ఈ ఫోన్‌ హ్యాకింగ్‌ ఆరోపణలకు సంబంధించి ప్రిన్స్‌ హ్యారీతో పాటు వంద మందికి పైగా ప్రముఖులు కోర్టులో దావా వేశారు. దీనిపై లండన్‌ కోర్టులో విచారణ చేపట్టగా ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు హ్యారీ మంగళవారం న్యాయస్థానంకి హాజరయ్యారు. ప్రస్తుతం తన భార్య మేఘన్‌ మర్కెల్‌, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న ఆయన సోమవారం లండన్‌ చేరుకున్నారు. ఈ ఉదయం హైకోర్టు ఎదుట హాజరయ్యారు. తన వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు మిర్రర్‌ గ్రూప్‌ ఉపయోగించిన మోసపూరిత పద్ధతుల కారణంగా తన జీవితం ఎలా ప్రభావితమైందో హ్యారీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఫోన్ హ్యాకింగ్‌కు పాల్పడటమే కాకుండా 1996 – 2010 మధ్య ప్రైవేటు ఇన్విస్టిగేటర్లను ఉపయోగించి మిర్రర్‌ గ్రూప్‌ తన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందని హ్యారీ కోర్టుకు తెలిపారు. ఇలా చట్టవ్యతిరేకంగా సేకరించిన వివరాలతో 140 ఆర్టికల్స్‌ను ప్రచురించినట్లు హ్యారీ కోర్టుకు వివరించారు. అయితే వాస్తవానికి ఈ కేసులో ప్రిన్స్‌ హ్యారీ సోమవారం కోర్టుకు హాజరవ్వాల్సి ఉండగా ఆయన రాలేదు. జూన్‌ 4న ఆయన కుమార్తె ప్రిన్సెస్‌ లిలిబెత్‌ పుట్టినరోజు కావడంతో లాస్‌ ఏంజిల్స్‌ నుంచి ఆయన ఆలస్యంగా బయల్దేరారని హ్యారీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా ఈ కేసులో మిర్రర్‌ గ్రూప్‌ తరఫు న్యాయవాదులు హ్యారీని క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో హ్యారీని కోర్టులో ప్రశ్నించనున్నట్లు సమాచారం.