Site icon HashtagU Telugu

Portugal: వైద్యం అందక భారత టూరిస్టు మృతి..

Marta Temido Imresizer

Marta Temido Imresizer

తమ దేశానికి వచ్చిన ఓ పర్యాటకురాలికి సరైన సమయంలో వైద్యం అందించడంలో ఆలస్యం కావడంతో ఆమె మృతి చెందింది. దీనిపై ఆగ్రహం చెందిన ఆ దేశ ప్రజలు తీవ్ర విమర్శలు చేశారు. వైద్య మంత్రిదే వైఫల్యం అని నినదించారు. దీంతో ఆ మంత్రి రాజీనామా చేయక తప్పలేదు. మన దేశంలో వైద్యం అందక నిత్యం ఎంతో మంది చనిపోతున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోవు. అలాంటి ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉంటాము. అందుకే ఈ సంఘటన మనకు ఆశ్చర్యం కలిగించక మానదు. వివరాల్లోకి వెళితే..
ఇండియాకు చెందిన 31 వారాల గర్భిణి (34) తన కుటుంబంతో పోర్చుగల్ పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు శ్వాస‌కు సంబంధించిన సమస్య ఎదురైంది. దీంతో వెంటనే శాంటా మారియా ఆసుపత్రికి తరలించారు. ఇది పోర్చుగల్‌లోనే ఉన్న అతి పెద్ద ఆసుపత్రి. అక్కడ ఆమె పరిస్థితి కాస్త నిలకడ అయ్యాక డాక్టర్లు.. సావో ఫ్రాన్సిస్కో జేవియర్ ఆసుపత్రికి మార్చమని సూచించారు. శాంటా మారియా ఆసుపత్రిలోని నియోనాటల్ డిపార్ట్‌మెంట్‌లో బెడ్లు లేకపోవడంతోనే డాక్టర్లు ఇలా సూచించారు. కాగా, ఆమెను ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్‌ అయ్యింది. రెండో ఆసుపత్రికి చేరగానే ఆమెకు సిజేరియన్ చేసి.. బిడ్డను నియోనాటల్ కేర్ యూనిట్‌లో ఉంచారు. కానీ మహిళ మాత్రం మృతి చెందింది.
ఈ ఘటనపై దేశంలో తీవ్రమైన నిరసన వెల్లువెత్తింది. ఎమర్జెన్సీ కేర్ సర్వీసులను మూసేయడం, ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత కారణంగానే ఇండియాకు చెందిన మహిళ మృతి చెందిందని.. దేశం పరువు పోయిందని ప్రజలు విమర్శలు ప్రారంభించారు. ఇందుకు వైద్య మంత్రి మార్తా టెమిడో కారణమంటూ మండిపడ్డారు. గతంలో ఎమర్జెన్సీ సర్వీస్ కేర్ సేవలు అందుబాటులో ఉండేవని.. ప్రత్యేకించి గర్భిణులకు ఇవి చాలా ఉపయోగపడేవి. అయితే ఇటీవల వీటిని రద్దు చేయడం వల్లే భారత మహిళ మృతి చెందిందని ఆరోపణలు వెల్లవెత్తాయి. వెంటనే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో మంగళవారం రాత్రి మార్త మంత్రి పదవికి రాజీనామా చేశారు.

కాగా, మార్త గురించి ప్రధాని ఆటియో కోస్టా ట్విట్టర్‌‌లో ఓ సందేశం ఉంచారు. మార్త చేసిన సేవలు చాలా గ్రేట్ అన్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో మార్త కారణంగానే పోర్చుగల్ త్వరగా పాండమిక్ నుంచి కోలుకున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న విమర్శలను అర్థం చేసుకుంటామని.. వైద్య రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి.. మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు.