Site icon HashtagU Telugu

China: వచ్చే ఏడాది ఎస్‌సిఒ నిర్వహణకై భారత్‌కు సహకరిస్తాం : జిన్‌పింగ్‌

Sco Imresizer

Sco Imresizer

వచ్చే ఏడాది షాంఘై సహకార సదస్సుకు ఆతిథ్యమివ్వనున్న భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌ నిర్వహించనున్న సదస్సుకు చైనా సహకారం అందిస్తుందని అన్నారు. ఉజ్బెకిస్థాన్‌లోని చారిత్రాత్మక నగరమైన సమర్‌కండ్‌లో నిర్వహిస్తున్న సదస్సులో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ లు ముఖాముఖీ కలుసుకున్నారు. 2020లో లఢఖ్‌లో ఇరు దేశాల సైనిక బలగాల ఉపసంహరణ ప్రారంభమైన అనంతరం ఇరుదేశాధినేతలు ఎదురుపడటం ఇదే మొదటిసారి. ఈ సదస్సులో ప్రధాని మోడీ, జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశం ఉండనుందని వార్తలు వచ్చాయి. అయితే ప్రధాని కార్యాలయం ఈ వార్తలను తిరస్కరించనూలేదు, సమర్థించలేదు.

ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశాల షెడ్యూల్‌ పూర్తయిన అనంతరం తెలియజేస్తామని విదేశాంగ కార్యదర్శి వినరు క్వాత్రా పేర్కొన్నారు. చైనా కూడా ఇరు నేతల మధ్య భేటీని ధృవీకరించలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షుడు షావ్కత్‌ మిర్జియోవ్‌, ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీలతో సమావేశం కానున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.