PM Modi- Meloni: ఉక్రెయిన్‌లో శాంతి పునరుద్ధరణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రయత్నాలు ప్రారంభించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత మార్గమే ఏకైక పరిష్కారమని మోడీ గతంలోనూ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 10న ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ (PM Modi- Meloni)తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరు నేతలు ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కనుగొనడానికి అంగీకరించారు. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. దీనితో పాటు రక్షణ, భద్రత, సైన్స్, విద్య, అంతరిక్షం, ఉగ్రవాద నిరోధం వంటి రంగాలలో సహకారంపై చర్చించారు.
భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
ప్రధాని మోదీ, మెలోనీ మధ్య జరిగిన సంభాషణలో వాణిజ్య సంబంధాలపైనా చర్చ జరిగింది. భారత-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (India-EU Free Trade Agreement), 2026లో జరగబోయే ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’కు ఇటలీ ప్రధాని మెలోనీ తన మద్దతును ప్రకటించారు. అలాగే ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEEEC)ను ప్రోత్సహించడానికి కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు అంగీకరించారు.
Also Read: ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాక్ క్రికెటర్ల హవా
ఉక్రెయిన్ శాంతిపై చర్చ
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై మోదీ, మెలోనీ మధ్య విస్తృతంగా చర్చ జరిగింది. 2025-29 మధ్య సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక కింద సంబంధాలను మరింత లోతుగా తీసుకెళ్లాలని ఇద్దరు నేతలు అంగీకరించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం అవసరమని నొక్కి చెబుతూ భారతదేశం ఈ విషయంలో పూర్తి మద్దతు ఇస్తుందని మోదీ పునరుద్ఘాటించారు.
ఎక్స్ (X)లో పీఎం మోదీ ప్రకటన
ఇటలీ ప్రధాని మెలోనీతో మాట్లాడిన తర్వాత పీఎం మోదీ ఈ విషయాన్ని తన ఎక్స్ (X) ఖాతాలో పంచుకున్నారు. “ప్రధాని జార్జియా మెలోనీతో చాలా మంచి సంభాషణ జరిగింది. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే మా సంయుక్త నిబద్ధతను పునరుద్ఘాటించాము. ఉక్రెయిన్ సంఘర్షణను వీలైనంత త్వరగా ముగించాలనే ఉమ్మడి ఆసక్తిని వ్యక్తం చేశాం” అని మోదీ పేర్కొన్నారు. అలాగే ఇరుపక్షాలకు ప్రయోజనం చేకూర్చే భారత్-యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందానికి తుది రూపం ఇవ్వడానికి, IMEEEC చొరవ ద్వారా కనెక్టివిటీని పెంచడానికి ఇటలీ చురుకైన సహకారం అందిస్తున్నందుకు ప్రధాని మెలోనీకి ధన్యవాదాలు తెలిపారు.