అమెరికా(America )లో ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు (Plane Crash) భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే ఓ ఆర్మీ హెలికాప్టర్, పౌరవిమానం ఒకదానికొకటి ఢీకొని, మంటలు చెలరేగడంతో మొత్తం 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు మూడ్రోజులకే ఫిలడెల్ఫియాలో మరో విమానం షాపింగ్ మాల్ వద్ద కూలిపోయి, ఏడుగురు మరణించగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తాజాగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 1382 విమానం హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురైంది. హ్యూస్టన్‌లోని జార్జి బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగాయి. దీనిని గుర్తించిన ప్రయాణికులు భయంతో పెద్దగా అరిచారు. దీంతో వెంటనే సిబ్బంది అప్రమత్తమై, అత్యవసర తలుపులు తెరిచి ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు.
ఈ విమానంలో మొత్తం 104 మంది ప్రయాణికులు ఉండగా, నలుగురు సిబ్బందితో సహా వారందరినీ సురక్షితంగా కిందకు దించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేసారు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తేల్చారు. ప్రయాణికులందరినీ మధ్యాహ్నం 12.30 గంటలకు మరో విమానం ద్వారా న్యూయార్క్ పంపించారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వరుస విమాన ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు విమాన ప్రయాణాల గురించి ఆలోచనలో పడుతున్నారు. ముఖ్యంగా, సాంకేతిక సమస్యల నివారణపై అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.