Biparjoy: అరేబియా సముద్రం నుంచి ఎగసిపడుతున్న బిపార్జోయ్ (Biparjoy) తుఫాను జూన్ 15న గుజరాత్‌లోని కచ్ తీరాన్ని, పాకిస్థాన్‌లోని కరాచీ తీరాన్ని తాకనుంది. బిపార్జోయ్ (Biparjoy) ముప్పును దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను తరలించడానికి పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో సైన్యాన్ని మోహరించారు.
పాకిస్థాన్ వాతావరణ శాఖ ఏం చెబుతోంది..?
పాకిస్తాన్ వాతావరణ శాఖ ప్రకారం.. కరాచీ నుండి 140 కి.మీ దూరంలో సైక్లోన్ బిపార్జోయ్ ఉంది. కరాచీతో పాటు సింధ్ తీర ప్రాంతాలను బిపార్జోయ్ తాకే అవకాశం ఉంది. అయితే, దీని తీవ్రత జూన్ 17, 18 మధ్య తగ్గుతుంది. ఈ సమయం పాకిస్థాన్‌కు చాలా సవాల్‌గా ఉంది. 140-150 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 14 ఉదయం కరాచీకి దక్షిణంగా 470 కిలోమీటర్లు (292 మైళ్ళు) దూరంలో అరేబియా సముద్రంలో బిపార్జోయ్ ఉన్నట్లు పాకిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.
సురక్షిత ప్రాంతాలకు ప్రజలు
సైక్లోన్ బిపార్జోయ్ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో నష్టం కలిగించే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా, 80,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించడానికి సహాయం చేయాలని ఆర్మీ, నేవీకి ఆదేశాలు ఇవ్వబడ్డాయి. తట్టా, కేతి బందర్, సుజావల్, బాడిన్, తార్పార్కర్, ఉమర్‌కోట్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, ఇతర ఆశ్రయాలకు పంపడానికి ఆర్మీ , నేవీ సహాయం తీసుకున్నారు.
పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సమావేశం
తుపాను సన్నద్ధతపై జరిగిన సమావేశానికి పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అధ్యక్షత వహించారు. నిర్వాసిత కుటుంబాలకు ఆహారం, నివాసం, ఇతర సహాయాలు అందించాలని, ఆపదలో ఉన్న వారందరినీ తరలించేందుకు పూర్తి చేయాలని అధికారులను కోరారు. గత రెండు రోజుల్లో దాదాపు 45,000 మందిని తీరప్రాంత నగరాల నుంచి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జూన్ 15న తుఫాను భూమిని తాకేలోపు మరో 35,000 మందిని తరలించాలని భావిస్తున్నారు.