Kulbhushan Jadhav: కులభూషణ్ జాధవ్ .. భారత నేవీ మాజీ అధికారి. ఈయన ఇరాన్‌లోని చాబహార్‌లో వ్యాపారం చేస్తుండగా, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కిడ్నాప్ చేసి తమ దేశానికి తరలించింది. కులభూషణ్ జాధవ్ కిడ్నాప్‌లో ఐఎస్ఐకు సహకరించిన ముస్లిం స్కాలర్ ముఫ్తీ షా మిర్ దారుణ హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న తర్బత్‌లో ఈ ఘటన జరిగింది. శుక్రవారం రోజు మసీదులో ప్రార్థనలు ముగించుకొని ముఫ్తీ షా మిర్ బయటకు రాగానే, మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. శరీరంలోకి పెద్దసంఖ్యలో బుల్లెట్లు చొచ్చుకు వెళ్లాయి. స్థానిక ఆస్పత్రిలో అతడిని చేర్పించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. ముఫ్తీ షా మిర్‌పై గతంలోనూ రెండు హత్యాయత్నాలు జరిగాయి. అయితే అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఎట్టకేలకు ఈసారి దుండగుల బారి నుంచి తప్పించుకోలేకపోయాడు. కొన్ని రోజుల క్రితమే పాక్‌లోని ఖుజ్దార్ ప్రాంతంలో జేయూఐ-ఎఫ్ సంస్థకు చెందిన ఇద్దరు నాయకులను ఇలాగే దుండగులు కాల్చి చంపారు. ఆ సంస్థతో సన్నిహిత సంబంధాలున్న ముఫ్తీ షా మిర్‌ను కూడా అదేరీతిలో కాల్చి చంపడం గమనార్హం.
Also Read :Dawood Ibrahim: రంగంలోకి దావూద్ గ్యాంగ్.. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ !
ఎవరీ ముఫ్తీ షా మిర్ ?
- ముఫ్తీ షా మిర్ పాకిస్తాన్‌లోని జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఎఫ్ (జేయూఐ-ఎఫ్) అనే సంస్థలో యాక్టివ్‌గా పనిచేసే వాడు.
- ముఫ్తీ ముసుగులో ఇతగాడు మానవ, ఆయుధాల అక్రమ రవాణాలో పాల్గొనేవాడు.
- పాక్ గూఢచార సంస్థ ISI నేతృత్వంలోని డెత్ స్క్వాడ్‌లతో ముఫ్తీ షా మిర్‌కు సంబంధాలు ఉన్నాయని అంటారు.
- బెలూచిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా సాయుధ కార్యకలాపాలను నిర్వహించే వారిని గుర్తించి ఏరి పారేయడమే ఐఎస్ఐ డెత్ స్క్వాడ్‌ల పని.
- బెలూచిస్తాన్ ప్రాంతం నుంచి అనేక మంది యువకుల కిడ్నాప్‌లు, హత్యల వెనుక ముఫ్తీ షా మిర్ ఉన్నట్లు చెబుతారు.
- 2016లో ఇరాన్-పాకిస్తాన్ బార్డర్‌లో భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాధవ్‌ను కిడ్నాప్ చేశారు. ఇందుకోసం ముల్లా ఒమర్ ఇరానీకి చెందిన జైష్ అల్-అద్ల్ ఉగ్రసంస్థ, ముఫ్తీ షా మిర్ కలిసి పనిచేశారు. చివరకు జాధవ్‌ను కిడ్నాప్ చేసి, పాక్ సైన్యానికి అప్పగించారు.
Also Read :Weekly Horoscope : వారఫలాలు.. మార్చి 9 నుంచి మార్చి 15 వరకు రాశిఫలాలను తెలుసుకోండి
కులభూషణ్ జాధవ్‌కు మరణశిక్షపై..
- 2017 ఏప్రిల్ 10న పాకిస్తాన్‌లోని ఫీల్డ్ జనరల్ కోర్ట్ మార్షల్.. కులభూషణ్ జాధవ్‌కు(Kulbhushan Jadhav) మరణశిక్ష విధించింది.
- జాధవ్‌కు మరణశిక్ష విధించడాన్ని న్యాయపరంగా సవాల్ చేసేందుకు భారత్‌కు అనుమతి ఇచ్చేది లేదని పాకిస్తాన్ తేల్చి చెప్పింది. దీంతో పాకిస్తాన్‌పై భారతదేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
- ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్నది. 2019 జూలైలో తీర్పును ఇచ్చింది. జాధవ్‌ను భారత్ తరఫు న్యాయవాది కలిసేందుకు అనుమతి ఇవ్వాలని పాక్‌కు కోర్టు సూచించింది. కుల్‌భూషణ్‌ను దోషిగా నిర్ధారించిన ప్రక్రియను సమీక్షించాలని నిర్దేశించింది.