Pakistan Protests Turn Violent: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ చేసిన ప్రకటన పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించింది. ఇమ్రాన్ ఖాన్‌ను విడిపించేందుకు పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు. నిరసనకారులు ఇస్లామాబాద్‌లోని రెడ్ జోన్‌లో ఉన్న డి-చౌక్‌కు చేరుకున్నారు. ఎక్కడికక్కడ పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం (Pakistan Protests Turn Violent) జరుగుతుంది. ఇందులో 6 మంది చనిపోయారు. వీరిలో నలుగురు పాకిస్థానీ రేంజర్లు ఉన్నట్లు సమాచారం. 4,000 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇది పిటిఐ కార్యకర్తల దాడి అని ప్రధాని షాబాజ్ షరీఫ్ అన్నారు. నలుగురు భద్రతా సిబ్బంది మరణించారని ఆయన తెలిపారు. రేంజర్లు కాల్పులు జరిపారని పీటీఐ ఆరోపించింది. ఈ ఘటనలో ఇద్దరు ఆందోళనకారులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. ఇస్లామాబాద్‌లో ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. నిరసనకారులను ఎదుర్కోవడానికి ఆర్టికల్ 245 ప్రకారం సైన్యాన్ని మోహరించారు. రోడ్డుపై ఆందోళన చేస్తున్న వారిని చూసి కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
బుష్రా బీబీ ఏం చెప్పారు?
గత వారం బుష్రా బీబీ వీడియో సందేశం ఇచ్చారు. సౌదీ అరేబియాలోని మదీనా సందర్శించిన తర్వాత తన కుటుంబంపై ప్రతికూల ప్రచారం మొదలైందని ఆమె ఆరోపించారు. అలాగే ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి బయటికి వచ్చాకే మనం (కార్యకర్తలను ఉద్దేశించి) ఇంటి వెళ్దామంటూ ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
అయితే సౌదీ అరేబియాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహించరానిదని ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. సౌదీ అరేబియా అన్ని రంగాల్లో పాకిస్థాన్‌కు అండగా నిలుస్తోందని అన్నారు. సౌదీ అరేబియా షరతులు లేకుండా పాకిస్తాన్‌కు సహాయం చేస్తుందని, బుష్రా బీబీ ఇచ్చిన ప్రకటన సౌదీ లాంటి సోదరుడిపై విషం చిమ్మినట్లు ఉందని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇలాంటి వారిపై కఠినంగా పోరాడి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రధాని షరీఫ్ అన్నారు. పాకిస్థాన్‌లో బుష్రా బీబీపై చాలా ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన విషయం తెలిసిందే.