Site icon HashtagU Telugu

Bankruptcy: దివాళా అంచున పాకిస్తాన్.. లగ్జరీ కార్ల వేలానికి సిద్ధం!

People Minister Premises Auction Islamabad Government Owned Fbc13476 Ba70 11e8 Aa2b Bfb0450a5721

People Minister Premises Auction Islamabad Government Owned Fbc13476 Ba70 11e8 Aa2b Bfb0450a5721

Bankruptcy: పాకిస్తాన్ దేశం దివాళా అంచున నిలిచింది. ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రతరమైంది. దీంతో ఆ దేశ ప్రధానమంత్రి షరీఫ్ కఠిన, అసాధారణ నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర మంత్రులకు వేతనాలు చెల్లించబోమని స్పష్టంచేశారు. మంత్రులు తమ బిల్లులను తామే చెల్లించుకోవాలని సూచించారు. విదేశీ పర్యటనల సమయంలో ఖర్చులు తగ్గించుకోవాలని కోరారు. విమానాల్లో ఎకానమీ తరగతిలోనే ప్రయాణించాలని, ఫైవ్ స్టార్ హోటళ్ళలో బస చేయొద్దని కోరారు.

కేంద్ర మంత్రులు తమ వద్ద ఉన్న లగ్జరీ కార్లను ప్రభుత్వానికి అప్పగిస్తే, వాటిని వేలం వేస్తామన్నారు. మంత్రులకు అవసరం అనుకుంటే భద్రత కోసం ఒక కారును మాత్రమే కేటాయిస్తామని తెలిపారు. మిగిలిన లగ్జరీ కార్లను వేలం వేస్తామని ప్రధాని షరీఫ్ ప్రకటించారు. దౌత్యవేత్తలు, విలేఖరులు తదితరులతో నిర్వహించే సమావేశాల కోసం చేసే ఖర్చును కూడా తగ్గించుకోవాలని సూచించారు.

మరోవైపు దివాళా అంచున నిలిచిన మిత్రదేశం పాకిస్తాన్‌ను ఆదుకునేందుకు డ్రాగన్ ముందుకు వచ్చింది. చైనా డెవలప్‌మెంట్ బ్యాంకు 7000 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు సమ్మతించింది. అతర్జాతీయ ద్రవ్య నిధి నిబంధనలకు లోబడి ఈ బిల్లును పాక్ జాతీయ అసెంబ్లీ ఆమోదించిన ఒక రోజు తర్వాత రుణం ఇచ్చేందుకు చైనా అంగీకరించింది.

వారం రోజుల్లో పాకిస్తాన్‌కు చైనా నుంచి నిధులు అందనున్నాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ వరకు పాక్ సెంట్రల్ బ్యాంకు వద్ద 3.2 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ నిధులు పాకిస్తాన్‌ దిగుమతులకు మూడు వారాలకు మాత్రమే సరిపోయే అవకాశం ఉంది. ఇపుడు చైనా ప్రకటించిన ఆర్థిక సాయంతో ఊపిరి పీల్చుకుంది.