Fuel Prices: ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ విరమణ కోసం మధ్యవర్తిగా వ్యవహరిస్తానని పాకిస్థాన్ చెప్పుకుంటుంటే, మరోవైపు ఆ దేశంలో చమురు కొరత కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్న రాత్రి పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు 137 రూపాయలు, డీజిల్ ధరను లీటరుకు 184 రూపాయలు పెంచుతూ భారీ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో పాకిస్థాన్‌లో ఇప్పుడు డీజిల్ ధర లీటరుకు 520 రూపాయలు, పెట్రోల్ ధర 458 రూపాయలకు చేరుకుంది.
ఈ కొత్త ధరలు అర్ధరాత్రి నుండి అమలులోకి రావడంతో పాకిస్థాన్‌లోని వివిధ నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టారు. పాత ధరలకే ట్యాంకులు నింపుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు ఎగబడ్డారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి 12 గంటల కంటే ముందే చమురు పోయడానికి నిరాకరించిన బంకు సిబ్బందిపై దాడులకు దిగినట్లు వీడియోలు, ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.
Also Read: బోణీ కొట్టిన హైదరాబాద్.. హోం గ్రౌండ్‌లో కేకేఆర్ చిత్తు!
ఆర్థిక మాంద్యం భయం
పాకిస్థాన్ పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ఈ ధరల పెరుగుదలను ప్రకటిస్తూ.. దేశంలో వనరుల కొరత (చమురు నిల్వలు లేకపోవడం) కారణంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువులైన పాలు, పిండి, కూరగాయల ధరలు పెరగడమే కాకుండా, పరిశ్రమలు కూడా మూతపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాకిస్థాన్ వ్యూహంపై అనుమానాలు
ఇరాన్ ప్రతిరోజూ ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ గుండా రెండు పాకిస్థాన్ నౌకలు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే పాకిస్థాన్ తన సొంత అవసరాల కోసం గల్ఫ్ దేశాల (సౌదీ అరేబియా, UAE, ఒమన్) నుండి వచ్చే చమురును తన దేశానికి తెచ్చుకోకుండా అమెరికాకు తరలిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు ప్రతిరోజూ 2 మిలియన్ బారెళ్ల చమురు అవసరం ఉండటంతో పాకిస్థాన్ తన వాటాను అమెరికాకు ఇచ్చి, స్వదేశీ ప్రజలపై భారం మోపుతోందని విమర్శలు వస్తున్నాయి.
28 రోజుల్లో భారీ మార్పు
ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత మార్చి 6న పాకిస్థాన్ ప్రభుత్వం తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 55 రూపాయలు పెంచింది. తాజాగా చేసిన పెంపుతో కలిపి కేవలం 28 రోజుల్లోనే పెట్రోల్‌పై 192 రూపాయలు, డీజిల్‌పై 239 రూపాయలు అదనంగా పెరిగాయి.
భారత్‌తో పోలిక.. విపక్షాల విమర్శలు
పాకిస్థాన్ విపక్ష పార్టీ (PTI) ఎంపీ మౌలానా నసీమ్ షా సోషల్ మీడియా వేదికగా భారత్, పాకిస్థాన్ ధరలను పోల్చి చూపిస్తూ షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
భారత్‌లో: జనవరి నుండి ఇప్పటివరకు పెట్రోల్ ధర లీటరుకు సుమారు 95 రూపాయల వద్దే స్థిరంగా ఉంది.
పాకిస్థాన్‌లో: జనవరిలో 253 రూపాయలుగా ఉన్న పెట్రోల్ ధర, ఇప్పుడు ఏప్రిల్ నాటికి 459 రూపాయలకు (సుమారుగా) చేరుకుంది.
