Pakistan: పాకిస్థాన్ పోలీస్ స్టేష‌న్ లో భారీ పేలుడు.. 17 మంది మృతి.. పేలుడు వెనక కారణమిదే..?

పాకిస్థాన్ (Pakistan) వాయువ్య ప్రాంతంలోని ఉగ్రవాద వ్యతిరేక కేంద్రంలో సోమవారం జరిగిన జంట పేలుళ్ల (Explosions) వెనుక ఉగ్రవాది హస్తం లేదని పోలీసులు మంగళవారం తేల్చారు.

  • Written By:
  • Publish Date - April 26, 2023 / 06:24 AM IST

పాకిస్థాన్ (Pakistan) వాయువ్య ప్రాంతంలోని ఉగ్రవాద వ్యతిరేక కేంద్రంలో సోమవారం జరిగిన జంట పేలుళ్ల (Explosions) వెనుక ఉగ్రవాది హస్తం లేదని పోలీసులు మంగళవారం తేల్చారు. ఈ దాడిలో సుమారు 17 మంది మరణించగా, మరో 70 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి 8.20 గంటలకు స్వాత్ జిల్లాలోని కబాల్‌లోని పోలీస్ స్టేషన్ కాంపౌండ్‌లో పేలుడు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. ఈ కాంప్లెక్స్‌లో కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (CTD) కార్యాలయం, ఒక మసీదు కూడా ఉన్నాయి. అంతకుముందు దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొన్నారు. అయితే, తర్వాత ఖండించారు.

ఈ పేలుడులో మరణించిన వారిలో ఒక బాలిక, 12 మంది పోలీసులు, నలుగురు ఖైదీలు ఉన్నారని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సీటీడీ ఖలీద్ సుహైల్ తెలిపారు. ఆత్మాహుతి దాడికి సంబంధించిన ప్రాథమిక వాదనలను సుహైల్ తోసిపుచ్చుతూ.. పోలీసు స్టేషన్‌లో ఒక దుకాణం ఉందని, అక్కడ భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వ చేసినట్లు చెప్పారు. ఆర్డినెన్స్ డిపోలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు.

Also Read: Parkash Singh Badal: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత!

ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని ఎలాంటి ఆధారాలు లభించలేదని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆయుధాగారంలో మంటలు, షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) అక్తర్ హయత్ కూడా ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందనే విషయాన్ని కొట్టిపారేశారు. పేలుడు కారణంగా చుట్టుపక్కల ఉన్న మసీదులు, ఇళ్లు, పాఠశాల గోడలు, పైకప్పులు కూడా కూలిపోవడంతో శిథిలాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయని దర్యాప్తు నివేదిక పేర్కొంది.