Pakistan: మునిగిపోవడానికి సిద్ధంగా పాక్‌ ఆర్థిక వ్యవస్థ: ఫిచ్‌ నివేదిక

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ ఫిచ్‌ పేర్కొంది.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ ఫిచ్‌ పేర్కొంది. ఈ మేరకు పాక్‌ (Pakistan) కరెన్సీకి ఇష్యూర్‌ డీఫాల్ట్‌ రేటింగ్‌ (ఐడీఆర్‌) CCC- ఇచ్చింది. గతంలో పాక్‌కు CCC+ రేటింగ్‌ ఉండేది. దీంతో పాక్‌ నగదు మరింత పతనమయ్యే అవకాశం ఉందని అర్థం. దీంతోపాటు విదేశీ మారక ద్రవ్య నిల్వలు కనిష్ఠానికి పడిపోవడం, బయట నుంచి ద్రవ్య మద్దతు తగ్గడం వంటి అంశాలను సూచిస్తోంది. ‘‘విదేశీ మారక ద్రవ్య నిల్వలు కనిపిస్తున్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థ పతనం దిశగానే వెళుతోంది. కరెంటు ఖాతా లోటు, విదేశీ చెల్లింపుల్లో ఇబ్బందులు, 2022 నాలుగో త్రైమాసికంలో ఫారెన్‌ ఎక్స్ఛేంజి ద్వారా సెంట్రల్‌ బ్యాంక్‌ జోక్యం (ఎక్స్ఛేంజి రేటు నియంత్రణ) వంటివి చోటు చేసుకొన్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తక్కువగా ఉన్నాయని భావిస్తున్నాం. కానీ, పాక్‌ (Pakistan) తీసుకొన్న కొన్ని చర్యల కారణంగా కోలుకుంటుందని అంచనా వేస్తున్నాం’’ అని ఫిచ్‌ పేర్కొంది.

ఐఎంఎఫ్‌ ప్రోగ్రాం 9వ రివ్యూను పాక్‌ (Pakistan) విజయవంతగా పూర్తిచేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఏడాది ఎన్నికలు ఉండటంతో ఈ ప్రోగ్రామ్‌ను కొనసాగించడంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రేటింగ్‌ను తగ్గించినట్లు వివరించింది. దివాలా తీయడం లేదా రుణ పునర్‌వ్యవస్థీకరణ ముప్పు ఇప్పటికీ పొంచి ఉందని వెల్లడించింది. అకాల వర్షాలు, ఎండలు, ఉగ్రదాడులతో పాక్‌లో అస్థిరత కొనసాగుతోందని ఫిచ్‌ పేర్కొంది. పాక్‌ ఇటీవలే దాదాపు 10 రోజుల పాటు ఐఎంఎఫ్‌ బృందంతో చర్చలు జరిపింది. కానీ, ఎటువంటి రుణసాయం పొందలేకపోయింది.

Also Read:  South Central Railway: తాత్కాలికంగా 17 రైళ్ల రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే