Imran Khan: మే 9 హింసాకాండలో కాల్పులకు సంబంధించిన రెండు కేసుల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)పై బుధవారం (జూన్ 21) అరెస్ట్ వారెంట్‌లను పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం కోర్టు (ATC) రద్దు చేసింది. ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (70) మంగళవారం (జూన్ 20) లాహోర్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టుకు కట్టుదిట్టమైన భద్రత మధ్య హాజరయ్యారు. తనపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను సవాలు చేశారు.
ఇమ్రాన్ ఖాన్ తరపు న్యాయవాది క్లుప్త వాదనల తర్వాత ATC అతనికి రెండు కేసులలో జూలై 7 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష ష్యూరిటీ మొత్తాన్ని డిపాజిట్ చేయమని కోరినట్లు యాంటీ-టెర్రరిజం కోర్టు అధికారి ఒకరు చెప్పారు.
అంతకుముందు మే 9 అల్లర్ల సమయంలో విధ్వంసానికి సంబంధించిన కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌తో సహా అనేక ఇతర మాజీ, ప్రస్తుత PTI పార్టీ నాయకులకు లాహోర్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు మంగళవారం (జూన్ 20) నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్ నివేదిక ప్రకారం.. నిందితులు మే 9 అల్లర్లలో కల్మా చౌక్‌లో కంటైనర్‌ను తగలబెట్టడం, మోడల్ టౌన్‌లోని పిఎంఎల్-ఎన్ కార్యాలయానికి నిప్పంటించినట్లు తేలింది. దీనికి సంబంధించి విచారణ అధికారి ఇన్‌స్పెక్టర్ ముహమ్మద్ సలీం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరారు.
ఇమ్రాన్ ఖాన్ అల్ ఖదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఖాన్‌ను మే 9న ఇస్లామాబాద్ హైకోర్టు నుండి అరెస్టు చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ అంతటా హింస చెలరేగింది. ఈ హింసాకాండలో దాదాపు 5000 మంది పిటిఐ మద్దతుదారులు అరెస్టయ్యారు. దీంతో పాటు పలువురు నేతలను అరెస్టు చేశారు.