PAK PM Shahbaz Sharif : పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (PAK PM Shahbaz Sharif ) పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన ఆపరేషన్ సింధూర్ యుద్ధం గురించి అసత్య ప్రచారం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు
ఆగస్టు 14న పాకిస్తాన్ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని షెహబాజ్ షరీఫ్ తన X (గతంలో ట్విట్టర్) ఖాతాలో శుభాకాంక్షలు తెలియజేశారు. తన పోస్ట్‌లో పాకిస్తాన్ సృష్టికి కారణమైన మహమ్మద్ అలీ జిన్నా, అల్లామా మొహమ్మద్ ఇక్బాల్‌లను ఆయన కొనియాడారు.
అయితే, భారత్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. భారత్ మాపై యుద్ధాన్ని రుద్దింది. కానీ పాకిస్తాన్ ఈ యుద్ధంలో చారిత్రాత్మక విజయం సాధించింది అని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దీనితో పాటు పాకిస్తాన్ సైన్యం తమ గౌరవాన్ని నిలబెట్టుకుని శత్రువు అహంకారాన్ని ధ్వంసం చేసిందని, వీర సైనికులు శత్రువును మోకాళ్లపైకి దిగజార్చారని ఆయన అన్నారు. ఈ విజయం తమ ప్రజలలో దేశభక్తిని పెంచిందని ఆయన పేర్కొన్నారు.
Also Read: UP : సీఎంను పొగిడినందుకు ఎమ్మెల్యే ను సస్పెండ్ చేసిన అఖిలేశ్ యాదవ్
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భారత్ 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది. దీనిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడుల తరువాత పాకిస్తాన్ సైన్యం భారత నగరాలపై దాడులు చేయడానికి ప్రయత్నించగా భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ తర్వాత భారత సైన్యం పాకిస్తాన్ సైనిక శిబిరాలపై కూడా ప్రతిదాడి చేసింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యం తీవ్ర ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ షెహబాజ్ షరీఫ్ దీనిని “చారిత్రాత్మక విజయం”గా చిత్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు దారితీశాయి. పాకిస్తాన్ సంస్కరణలకు నోచుకోకుండా.. ఇంకా ఇలాంటి అసత్య ప్రచారాలను చేస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.