Drug Traffickers Clash : మెక్సికోలోని సినలోవా రాష్ట్రం క్యులియాకాన్ నగరం డ్రగ్స్ ముఠాలకు కేరాఫ్ అడ్రస్. ఆ నగరం కేంద్రంగా డ్రగ్స్ ముఠాలు పెద్దఎత్తున యాక్టివిటీస్ చేస్తుంటాయి. ఈక్రమంలో ఆయా ముఠాల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతుంటాయి. తాజాగా జరిగిన ముఠాల ఘర్షణల్లో దాదాపు 100 మందికిపైగా చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా 53 మంది మరణాలనే ధ్రువీకరించారు. మరో 51 మంది ఆచూకీ తెలియడం లేదని అంటున్నారు. వారు కూడా చనిపోయి ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.
Also Read :Beautiful Governor Jailed : 58 మంది పురుష సిబ్బందితో అఫైర్.. గవర్నర్ జైలుపాలు
సెప్టెంబరు 9 నుంచి క్యులియాకాన్ నగరంలో డ్రగ్స్ ముఠాల మధ్య భారీ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ గొడవల్లోనే మరణాలు సంభవించాయని సమాచారం. ఈ ఏడాది జులై నెలలో డ్రగ్ డాన్ 74 ఏళ్ల ఇస్మాయిల్ ఎల్‌మాయో జంబాడను(Drug Traffickers Clash) మెక్సికోలోని అమెరికా ఎఫ్‌బీఐ ఏజెంట్లు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి డ్రగ్స్ గ్యాంగుల ఆగడాలు పెచ్చుమీరాయి. గ్యాంగులు డ్రగ్స్ వ్యాపారంపై ఆధిపత్యం కోసం నిత్యం తలపడుతున్నాయి. దీంతో వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు, భద్రతా బలగాలు విస్తుపోతున్నాయి.
ఈ ఘర్షణల్లో పాల్గొన్న దాదాపు 40 మందిని అరెస్టు చేశామని సినలోవా రాష్ట్ర గవర్నర్ రూబెన్ రోచా మోయా వెల్లడించారు. ఘర్షణలు జరిగిన ప్రాంతాల ప్రజలకు దాదాపు 5వేలకుపైగా ఆహార పొట్లాలను పంపిణీ చేశామని చెప్పారు. ఈ పరిణామాలపై మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మనువెల్ లోపెజ్ ఓబ్రడార్ స్పందించారు. ‘‘మా దేశంలో అస్థిరతకు అమెరికాయే కారణం. అమెరికా ఎఫ్‌బీఐ ఏజెంట్లే ఇస్మాయిల్ ఎల్‌మాయో జంబాడను కిడ్నాప్ చేశారు’’ అని ఆయన ఆరోపించారు. ఈ గొడవలను ఆపేందుకు మెక్సికో ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. గురువారం నుంచే మిలిటరీ ఆపరేషన్‌ను చేపట్టారు. ఆర్మీ రంగంలోకి దిగగానే క్యులియాకాన్ నగరంలోని మరో కీలకమైన డ్రగ్స్ ముఠా ‘లాస్ ఛాపిటోస్’ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.