Operation Sindhu : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ చేపట్టిన భారీ పౌరుల తరలింపు చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. మంగళవారం ‘ఆపరేషన్ సింధు’ కింద మరో 380 మంది భారతీయులు విజయవంతంగా స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో 219 మంది ఇరాన్ నుంచి, 161 మంది ఇజ్రాయెల్ నుంచి భారత్‌కి వచ్చారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది.
ఇరాన్‌లోని మషద్ నగరంలో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు న్యూఢిల్లీకి చేరింది. ఇందువల్ల ఇప్పటివరకు ఇరాన్ నుంచి మొత్తం 2,295 మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు ఎంఈఏ ప్రకటించింది. ఈ వివరాలను మంత్రిత్వ శాఖ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించింది.
ఇజ్రాయెల్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి భారతీయులను జోర్డాన్ మీదుగా తరలించే ప్రక్రియను నిన్న ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలి విడతగా 161 మంది భారతీయులు అంమాన్ నుంచి ప్రత్యేక విమానంలో మంగళవారం ఉదయం 8:20 గంటలకు న్యూఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా వారిని స్వయంగా స్వాగతించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ఇజ్రాయెల్ నుంచి తరలించిన మొదటి బృందానికి స్వాగతం పలకడం గర్వంగా ఉంది. మేము అక్కడి పరిస్థితులపై నిత్యం నజర్ వేస్తున్నాం. ఇరాన్, ఇజ్రాయెల్‌లోని భారతీయులకు అవసరమైన అన్ని సహాయాలు అందించడానికి కట్టుబడి ఉన్నాం. ప్రతి ఒక్కరూ సురక్షితంగా స్వదేశానికి చేరుకునే వరకు ఆపరేషన్ కొనసాగుతుంది” అని తెలిపారు.
ఇరాన్, ఇజ్రాయెల్‌లలో చిక్కుకున్న ఎన్నో కుటుంబాలు భారత ప్రభుత్వ స్పందనపై హర్షం వ్యక్తం చేశాయి. హైఫాలో ఉన్న ఒక భారతీయుడు మాట్లాడుతూ, “వార్‌జోన్‌లా మారిన హైఫాలో పరిస్థితి భయంకరంగా ఉంది. భారత్ ప్రభుత్వం మమ్మల్ని సురక్షితంగా తరలించడం మా అదృష్టం” అని తెలిపారు.
మరో ప్రయాణికుడు స్పందిస్తూ, “విదేశాంగ శాఖ చాలా సమర్థంగా వ్యవహరించింది. తొందరగా స్పందించి ప్రతి ఒక్కరికీ సహాయం చేశారు. మాకు ఇంత సజావుగా ప్రయాణం అయ్యేలా ఏర్పాట్లు చేసినందుకు ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు” అని అన్నారు.