India : అటు ఇజ్రాయిల్.. ఇటు పాలస్తీనా. భారత్ ఎటువైపు..?

భారత్ దేశం (India) మాత్రం ఇజ్రాయిల్ పాలిస్తీనా విషయంలో రెండుగా చీలినట్లు కనిపిస్తోంది.

  • Written By:
  • Updated On - October 19, 2023 / 02:53 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Which side is India..? : ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య కొనసాగుతున్న భయంకర యుద్ధం రాను రాను భీకర రూపాన్ని తీసుకుంటోంది. మంగళవారం రాత్రి గాజాలోని అల్ ఆహ్లి ఆసుపత్రి పైన ఇజ్రాయిల్ చేసిన బాంబుతాడి యావత్తు ప్రపంచాన్ని కుదిపేసింది. వందలాది అమాయక ప్రాణాలు ఈ దాడిలో బలైపోయాయి. అయితే ఈ దాడి తాము చేయలేదని, పాలస్తీనా హమాస్ టెర్రరిస్టుల వద్ద ఉన్న రాకెట్లు మిస్ ఫైర్ కావడం వల్ల ఈ ఘటన జరిగిందని ఇజ్రాయిల్ వాదిస్తోంది. కాదు, ఈ దాడి చేసింది ఇజ్రాయిల్ అని హమాస్ వాదిస్తోంది. దీనికి తోడు నిన్న ఇజ్రాయిల్ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కూడా ప్రెస్ మీట్ లో గాజా ఆసుపత్రి పై దాడి ఇజ్రాయిల్ చేసింది కాదని, తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని అనడం ఇజ్రాయిల్ వాదనకు వత్తాసు పలికినట్టు అయింది.

We’re now on WhatsApp. Click to Join.

తమ దేశ జనాభా మీద, అందునా అసహాయంగా ఆసుపత్రిలో పడి ఉన్న అమాయక రోగుల మీద తామే పాలస్తీనీయులు ఎందుకు దాడి చేస్తారని ప్రపంచం అడుగుతోంది. దీనికి ఇజ్రాయిల్ స్పష్టమైన సమాధానం చెప్పవలసి ఉంది. ఏది ఏమైనా జరిగిన ఘటన అమానుషం, అత్యంత కిరాతకం, చరిత్రలోనే మరచిపోలేని మారణకాండ. దీనిమీద ఇజ్రాయిల్, పాలస్తీనా బ్లేమ్ గేమ్ ఎలా సాగినప్పటికీ, ప్రపంచమంతా ఈ రెండు దేశాలకు అటో ఇటో ఓ పక్షాన్ని తీసుకోవడం అనేది జరుగుతోంది. ఇది భవిష్యత్తులో ఎలాంటి రూపం తీసుకుంటుందో చెప్పలేము. అమెరికాతో సహా పశ్చిమ దేశాలు ఇజ్రాయిల్ వైపు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొమ్ముకాస్తున్నాయి. రష్యాతో సహా అరబ్ దేశాలు పాలస్తీనా వైపు నిలబడి మాట్లాడుతున్నాయి. చైనా లాంటి దేశాలు ఇరువైపులా శాంతి కావాలని కోరుకుంటున్నాయి. కానీ భారత్ దేశం (India) మాత్రం ఇజ్రాయిల్ పాలిస్తీనా విషయంలో రెండుగా చీలినట్లు కనిపిస్తోంది.

అక్టోబర్ 7వ తేదీన గాజా పాలకులు, హమాస్ దళాలు ఇజ్రాయిల్ పై దాడి చేసిన తర్వాత భారత (India) ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఇజ్రాయిల్ కు తమ పూర్తి సంఘీభావం తెలియజేశారు. ఆ తర్వాత కూడా ఆయన ఇజ్రాయిల్ ప్రధానితో ఫోన్లో మాట్లాడడం, ఇజ్రాయిల్ కు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్లు చేయడం కొనసాగించారు. అంతేకాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వర్గాలు, వారికి సాంస్కృతిక నేపథ్యంగా ఉన్న ఆర్ఎస్ఎస్ వంటి హిందూ మత సంస్థలు అన్నీ ఇజ్రాయిల్ వైపు స్పష్టమైన వైఖరి తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా పాలస్తీనా మీద విషం కక్కుతూ ఇజ్రాయిల్ చేస్తున్న దురాక్రమణ దాడులను బహిరంగంగానే సమర్థించడం కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలైన సావర్కర్ వంటి వారు యూదులకు వ్యతిరేకంగా మారణ హోమం సాగించిన హిట్లర్ ను తమ ఆరాధ్య నాయకుడిగా పేర్కొన్నారు. కానీ విచిత్రంగా యూదుల దేశమైన ఇజ్రాయిల్ కు అనుకూలంగా మన దేశ పాలకులు తమ వైఖరిని మార్చుకోవడం ఇటీవలి విపరీత పరిణామంగా కనిపిస్తోంది.

భారతదేశం (India) మొదటి నుంచి పాలస్తీనా అనుకూల వైఖరితో విదేశాంగ విధానాన్ని కొనసాగించింది. కానీ ఈ మధ్యకాలంలో ఇజ్రాయిల్ వైపు మన పాలకుల మొగ్గు చూపడం కనిపిస్తోంది. ప్రధాని మోడీ బహిరంగంగా ఇజ్రాయిల్ వైపు తమ సానుభూతిని ప్రకటిస్తున్నప్పటికీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం తమ విధానం పాలస్తీనా స్వావలంబనకు అనుకూలమని ఒక నామమాత్రపు ప్రకటన చేయడం కూడా విశేషంగా వార్తల్లోకి ఎక్కింది. ఈ ప్రకటన అలా ఉంచితే, రెండు దేశాల మధ్య తాజాగా చెలరేగిన యుద్ధ వాతావరణ నేపథ్యంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ఆ పార్టీ అధినాయకుడు ప్రధాని మోడీతో సహా అందరూ ఇజ్రాయిల్ తరపున మాట్లాడడం మాత్రం మానలేదు. బిజెపి, ఆర్ఎస్ఎస్ వైఖరిలో ఈ స్పష్టమైన మార్పు దేనికి సూచనగా భావించాలి అనే ప్రశ్నకు జవాబు ఒకటే దొరుకుతుంది. పాలస్తీనాలో ఉంటున్నది ముస్లిం వాసులు. వారిపై దాడి చేస్తున్నది ఇజ్రాయిల్ యూదులు. కనుకనే ఇజ్రాయిల్ వైపు మన పాలకులు మొగ్గు చూపుతున్నారని అర్థం చేసుకోవాలని విశ్లేషకులు చెప్తున్నారు.

Also Read:  Telangana: రేవంత్‌పై నూతన గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సంచలన వ్యాఖ్యలు.

పాలకుల స్టాండ్ ఒకలా ఉంటే, మనదేశంలో ప్రతిపక్షాల స్టాండ్ దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. భారతదేశంలో (India) ప్రతిపక్షాల ఇండియా కూటమి ఈ మధ్య ఒక సంయుక్త ప్రకటన జారీ చేసింది. దాదాపు 16 పార్టీల పైన ఉన్న ఈ కూటమి, తాజా ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధంలో తమ వైఖరి ఏమిటో స్పష్టం చేసింది. తాము స్పష్టంగా పాలస్తీనా పక్షాన ఉన్నట్టు ఇండియా కూటమి పేర్కొంది. పాలస్తీనా స్వయం ప్రతిపత్తిని తాము కోరుకుంటున్నామని, పాలస్తీనా ప్రజల హక్కులు పరిరక్షింపబడాలని, పాలస్తీనా దేశాన్ని సురక్షితం చేయాలని ఇండియా కూటమి తమ వాదన వినిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్లు గాని, ఆయన ప్రత్యేక స్పందన గాని కేవలం ఆయన పార్టీ అభిప్రాయమే అని, అది దేశం మొత్తం అభిప్రాయం కాదని ఇండియా కూటమిలోనున్న పార్టీలు వాదిస్తున్నాయి. అంతేకాదు. ఇటీవల మిజోరాం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు.

నెలల తరబడి మణిపూర్ మండిపోతుంటే, రెండుగా రాష్ట్రం చీలిపోయి అక్కడ మారణ హోమం జరుగుతుంటే ఒక్కసారి కూడా ఆ రాష్ట్రానికి వెళ్ళని ప్రధాని, ఇజ్రాయీలకు సంఘీభావం తెలపడంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదని రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సొంత దేశంలోనే ఒక రాష్ట్రం రెండు జాతుల మధ్య విడిపోయి భయంకర హింసా జ్వాలల్లో మండిపోతుంటే పట్టని నరేంద్ర మోడీకి ఇజ్రాయిల్ పట్ల సానుభూతి పొంగి పోతోందని ప్రతిపక్షాలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నాయి. ఇలా ఇజ్రాయిల్ పాలిస్తీనా యుద్ధం విషయంలో మన దేశంలో అధికార పార్టీ, ప్రతిపక్షాలు రెండుగా చీలిపోయిన వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా మనం పాలస్తీనా వాసుల స్వయంపాలన, స్వావలంబన వైపు నిబద్ధతతో నిలబడ్డాం.

ఇప్పుడు ఆ వైఖరిలో మన పాలకులలో వచ్చిన మార్పు కేవలం ముస్లిం మైనారిటీల పట్ల వారు చూపుతున్న వివక్షాపూర్వక ధోరణికి అద్దం పడుతుందని విపక్షాలే కాదు, మేధావులూ రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. దేశం ఏదైనా ప్రాంతం ఏదైనా మతం ఏదైనా ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజల హక్కుల కోసం నిలబడాలి. ఆక్రమణ, ఆధిపత్యం, అణచివేత లాంటివి ప్రజలలో ప్రతిఘటనకు దారి తీస్తాయి. ఆ ప్రతిఘటన నుండి ఉగ్రవాదులు పుట్టుకొస్తారు. పాలస్తీనా చరిత్ర మనకు చెబుతున్నది ఇదే. ఈ విషయంలో స్పష్టమైన వైఖరి దేశమంతా తీసుకోవడం ఎవరికి ఎలా ఉన్నా, మన దేశానికి మాత్రం మంచిదే అవుతుంది.

Also Read:  Chandrababu : చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగింపు