Hunger Death: పేదలపై హంగర్ స్ట్రైక్ : ప్రతి 4 సెకన్లకు ఒకరు ఆకలితో చనిపోతున్నారట!!

ఆటవిక యుగం పోయింది. ఆధునిక యుగం వచ్చింది. అయినా ఆకలి చావులు ఆగడం లేదు. ఆకలి కేకలు ఆగడం లేదు.

  • Written By:
  • Publish Date - September 21, 2022 / 08:30 AM IST

ఆటవిక యుగం పోయింది. ఆధునిక యుగం వచ్చింది. అయినా ఆకలి చావులు ఆగడం లేదు. ఆకలి కేకలు ఆగడం లేదు.
ప్రపంచంలో ప్రతి 4 సెకన్లకు ఒకరు ఆకలితో చనిపోతున్నారట. ప్రతి రోజు దాదాపు 19,700 మంది ఆకలితో చనిపోతున్నారట. దీనిపై 75 దేశాలకు చెందిన 238 స్వచ్ఛంద సంస్థలు గొంతు కలిపి గర్జించాయి. ఇవన్నీ కలిసి సంతకాలు చేసి ప్రపంచ దేశాల నేతలకు ఒక బహిరంగ లేఖను రాశాయి. వరల్డ్ వైడ్ గా 34.5 కోట్ల మంది ఆకలితో అలమటిస్తు న్నారని ఈ లేఖ పేర్కొంది. 21వ శతాబ్దంలో మళ్లీ కరువు రాదని ప్రపంచ దేశాల నేతలు వాగ్దానం చేసినప్పటికీ.. సోమాలియా మరోసారి కరువును ఎదుర్కొంటోందని గుర్తు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 45 దేశాలలో 50 మిలియన్ల మంది ప్రజలు ఆకలి అంచున ఉన్నారని తెలిపింది.
ఈమేరకు వివరాలతో కూడిన బహిరంగ లేఖపై 238 స్వచ్ఛంద సంస్థలు కలిసి సంతకం కూడా చేయడం గమనార్హం.

రాత్రి భోజనం చేయని వారు 69 కోట్ల మంది..

ప్రపంచంలో రాత్రి భోజనం చేయని వారు దాదాపు 69 కోట్ల మంది ఉన్నారని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఆకలి సమస్య మధ్యతరగతి, తక్కువ ఆదాయ దేశాల్లోనే ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇక ఈ సమస్య కోవిడ్ -19 మహమ్మారి కారణంగా మరింత పెరిగింది..  ఎందుకంటే కోవిడ్  కారణంగా అనేక దేశాల ప్రజలు జీవనోపాధిని కోల్పోయారు. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా, ఈ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని ఎన్జీవో సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

అన్నం పరబ్రహ్మ స్వరూపం

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. ఆకలి అన్నవారికి కడుపునింపడం దైవ కార్యంతో సమానమని అంటారు. అంతేకాదు.. మనం తినే ఆహారాన్ని చిన్న చిన్న రీజన్స్ తో వృధా చేయవద్దని.. తినడానికి లేని వారిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే.. ఉన్నవారికి తినడానికి అనేక రకాల ఆహారపదార్ధాలున్నా రకరకాల రీజన్స్ తో తినడానికి ఉండదు. అదే సమయంలో పేదవారికి తినాలని ఉన్నా ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక.. అర్ధాకలితో అలమటిస్తారు. లేదా పస్తులు ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచలో ఆకలి సంక్షోభానికి ముగింపు పలకాలని పలు NGO సంస్థలు డిమాండ్ చేస్తున్నారు.