Australia Vs King : రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం.. ఇప్పుడు లేదు !! అయితేనేం కామన్వెల్త్ కూటమిలోని దేశాలు నేటికీ బ్రిటీష్ రాజు, రాణిని చాలా గౌరవిస్తాయి. ఏటా నిర్వహించే జాతీయ దినోత్సవాలకు వారిని సాదరంగా ఆహ్వానిస్తుంటాయి. తమ దేశాల చట్టసభల్లో ప్రసంగించే అవకాశాన్ని బ్రిటీష్ రాజు, రాణిలకు కల్పిస్తుంటాయి. ఈకోవలో మొదటిస్థానంలో ఉండే కామన్వెల్త్ దేశం ఆస్ట్రేలియా. అక్కడ స్వదేశీ ప్రభుత్వం ఉన్నప్పటికీ.. అధికారిక పాలకుడు మాత్రం నేటికీ బ్రిటన్ రాజే. ఇవాళ ఆస్ట్రేలియా పార్లమెంటును ఉద్దేశించి బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3 ప్రసంగించారు. ఆస్ట్రేలియాతో తమ రాజ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఈసందర్భంగా రాజు(Australia Vs King) గుర్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు ఎల్లవేళలా అండగా ఉంటామని ప్రకటించారు. బ్రిటన్ రాజు ప్రసంగం ముగిసిన తర్వాత.. పార్లమెంటులో అసలు సీన్ మొదలైంది.
Also Read :Group 1 : గ్రూప్-1 పరీక్షలకు సుప్రీంకోర్టులో లైన్ క్లియర్.. అభ్యర్థుల పిటిషన్ తిరస్కరణ
ఆస్ట్రేలియాలోని ఆదివాసీ తెగకు చెందిన మహిళా సెనెటర్ లిడియా థోర్పే తన ఆగ్రహాన్ని పార్లమెంటులో అందరి ముందు వ్యక్తపరిచారు. పార్లమెంటు వేదికపై బ్రిటన్ రాజు సతీమణితో సహా కూర్చొని ఉండగానే.. వారికి వ్యతిరేకంగా లిడియా థోర్పే నినాదాలు చేశారు. ‘‘మాకు ఇక రాజు అక్కర్లేదు.. రాచరికం అస్సలు అక్కర్లేదు’’ అని ఆమె డిమాండ్ చేశారు. ‘‘ మా దేశంపై మీకు హక్కులేదు. ఆస్ట్రేలియా భూమిని తిరిగి ఇచ్చేయండి. మా దేశం నుంచి దోచుకున్నవన్నీ రిటర్న్ చేయండి. ఇది మీ భూమి కాదు. మీరు మా రాజు కాదు’’ అని ఆమె గట్టిగా అరిచారు. ‘‘ఆస్ట్రేలియాలోని ఆదివాసీలతో ఐరోపా వలసదారులు దారుణంగా ప్రవర్తించారు. మా వాళ్లపై నరమేధానికి పాల్పడ్డారు’’ అని లిడియా థోర్పే ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో దాదాపు నిమిషం పాటు ఆమె గట్టిగా కేకలు వేశారు.
Also Read :Madrasas : కేంద్రానికి షాక్.. ఆ మదర్సాల మూసివేత ఆదేశాలపై ‘సుప్రీం’ స్టే
వాస్తవానికి ఆమె ఇలా మాట్లాడటం ఇదే తొలిసారేం కాదు. గతంలోనూ బ్రిటీష్ వలస విధానాన్ని థోర్పే బహిరంగంగా వ్యతిరేకించారు. 2022లో ఆస్ట్రేలియా సెనేట్‌కు లిడియా థోర్పే ఎన్నికయ్యారు. అప్పట్లో ఆమె ప్రమాణ స్వీకారం చేస్తూ.. బ్రిటన్ రాణిని వలస రాజ్యపాలకురాలిగా అభివర్ణించారు. దీనిపై అప్పటి సెనేట్ ప్రెసిడెంట్ జోక్యం చేసుకొని.. ‘‘సెనెటర్ థోర్పే మీరు ఇష్టం వచ్చినవు చదవొద్దు.. ప్రమాణస్వీకారం కార్డులో ఉన్నవే చదవండి’’ అని సూచించారు.