North Korea Nuclear Weapons: అమెరికా, దాని మిత్రదేశాలను ఎదుర్కొనేందుకు తాము కూడా అణ్వాయుధ సామర్థ్యాలను విపరీతంగా పెంచుకుంటామని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో అణ్వాయుధ సైనిక కూటమిని ఏర్పాటు చేసి ఇతర దేశాలను రెచ్చగొడుతున్నది అమెరికానే అని ఆయన ఆరోపించారు. ఉత్తర కొరియా 76వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ ప్రసంగించారు. తమ దేశం కూడా అణ్వాయుధాలను సిద్ధం చేసుకొని అమెరికా, దాని మిత్రదేశాలతో పోరాటానికి సర్వసన్నద్ధంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఎవరూ ఊహించనంత బలంగా దేశ సైన్యాన్ని, అణ్వాయుధ వ్యవస్థను నిర్మిస్తానని ప్రకటించారు. ఇప్పటికే అణ్వాయుధ బలగాల వ్యవస్థ(North Korea Nuclear Weapons) నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ తమ సైన్యంలో మొదలైందని కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు.
ఈ ఏడాది జులై నెలలో అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ఆ సందర్భంగా కొరియా సముద్రంలో అణ్వాయుధ సామర్థ్యం కలిగిన జలాంతర్గాములు, యుద్ధ నౌకలను అమెరికా మోహరించింది. అందుకే ఇప్పుడు అణ్వాయుధాల గురించి కిమ్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ దిశగా తాము కూడా సన్నద్ధం అవుతామని స్పష్టం చేశారు. అణ్వాయుధ శక్తిగా ఉత్తర కొరియా కూడా అవతరిస్తుందన్నారు. ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఆ సమయంలో ఉత్తర కొరియా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణులను ఇప్పటికే ఉత్తర కొరియా రెడీ చేసుకుంది. వాటిని తమ దేశంలో ఎక్కడి నుంచైనా ప్రయోగించేందుకు వీలుగా దాదాపు 250 మొబైల్ లాంచర్ వ్యవస్థలను సిద్ధం చేసింది. ఇటీవలే ఉత్తర కొరియాకు ఆత్మాహుతి డ్రోన్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దాన్ని స్వయంగా కిమ్ జోంగ్ ఉన్ పరీక్షించారు.