Site icon HashtagU Telugu

Kim Jong Un : రాజ్యాంగం మార్చేయండి.. ‘నంబర్ 1 శత్రుదేశం’పై సవరణ చేర్చండి : కిమ్

Kim Jong Un

Kim Jong Un

Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక ప్రకటన చేశారు. దక్షిణ కొరియాతో దౌత్యపరమైన సంప్రదింపులను రద్దు చేసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. దక్షిణ కొరియాతో దౌత్యపరమైన సంప్రదింపులను నిర్వహించే ప్రభుత్వ సంస్థలను రద్దు చేసినట్లు తెలిపారు. ఇకపై దక్షిణ కొరియాతో సయోధ్య కోసం ప్రయత్నాలు చేసేది లేదని  కిమ్ స్పష్టం చేశారు. ఉత్తర కొరియా పార్లమెంట్​ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ‘‘ఇప్పుడు రెండు కొరియాలు ఘర్షణ పడుతున్నాయి. ఇలాంటి టైంలో దక్షిణ కొరియాతో చర్చలు అనే ప్రసక్తే ఉండదు’’ అని ఉత్తర కొరియా పార్లమెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది. శాంతియుత సంప్రదింపులు – కొరియా పునరేకీకరణ కమిటీ, నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్ బ్యూరో, ఇంటర్నేషనల్ టూరిజం అడ్మినిస్ట్రేషన్​లను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపింది.  దక్షిణ కొరియాతో చర్చలు, సహకారం, సంప్రదింపులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఉత్తర కొరియా ప్రభుత్వం ఆచరణాత్మక చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఉత్తర కొరియా పార్లమెంట్​లో కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un)   ప్రసంగించారు. దక్షిణ కొరియాను తమ దేశానికి నంబర్ 1 శత్రువుగా ప్రస్తావించారు. ఈమేరకు దేశ రాజ్యాంగంలో సవరణ చేయాలని పార్లమెంట్​కు పిలుపునిచ్చారు. వచ్చే సమావేశంలోగా రాజ్యాంగాన్ని మార్చేయాలని పిలుపునిచ్చారు. 1961లో కొరియా ప్రాంతం దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలుగా విడిపోయినప్పటి నుంచే ‘శాంతియుత సంప్రదింపులు – కొరియా పునరేకీకరణ కమిటీ’ పనిచేస్తోంది. నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్ బ్యూరో, టూరిజం అడ్మినిస్ట్రేషన్ విభాగాలు ఉభయ దేశాల టూరిజం ప్రాజెక్టులను పర్యవేక్షిస్తాయి. ఇటీవల కాలంలో కిమ్ ఉపగ్రహాలు, ఆయుధాల ప్రయోగాలు ఉద్ధృతం చేశారు. ఈ ఏడాది అమెరికా, దక్షిణ కొరియాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశాలపై మరింత ఒత్తిడి పెంచేందుకే  కిమ్ ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు.

Also Read: Vivek Ramaswamy : ట్రంప్‌కు మద్దతు ప్రకటించిన వివేక్.. అమెరికా అధ్యక్ష రేసుకు గుడ్‌బై

కిమ్ జోంగ్ ఉన్ తండ్రి పిచ్చి ఎలా ఉండేదంటే.. 

ప్రస్తుత ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 1994 జూలై నుంచి 2011 డిసెంబర్‌లో తానుమరణించే వరకు ఉత్తర కొరియా నియంతగా కొనసాగారు. విదేశీ సినిమాలు చూడటం మొదలుకొని బ్లూ జీన్స్ ధరించడం వరకు అన్నింటినీ ఆయన నిషేధించారు. జోంగ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్‌కు సినిమాలంటే విపరీతమైన పిచ్చి. తన దేశంలో సినిమాలు తీయడానికి ఒక ప్రముఖ దక్షిణ కొరియా నటిని, ఆమె భర్తను కిడ్నాప్ చేశాడు. కిమ్ జోంగ్ ఇల్ నాటి ప్రముఖ దక్షిణ కొరియా నటి చోయ్ యున్ హీని కిడ్నాప్ చేసి, రెండున్నరేళ్లు నిర్బంధించి, ఆమె చేత 17 సినిమాలు చేయించాడు. ఈ సంఘటన 1978 నాటిది. చోయ్ యున్ హీ 60వ దశాబ్ధం నుండి 70ల తొలినాళ్ల వరకు గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె భర్త షిన్ జియోంగ్ గ్యున్ సినిమా దర్శకుడు. వీరు సెలబ్రిటీ జంటగా పేరుగాంచారు.ఓ జూనియర్ నటితో ఆమె భర్తకు అక్రమ సంబంధం ఏర్పడిన కారణంగా వారి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ సమయంలో నటి చోయ్ యున్ హీ ఒక వ్యాపార ఒప్పందం కోసం హాంకాంగ్‌ వెళ్లారు. ఇంతలో ఉత్తర కొరియా ఏజెంట్ ఆమెను కిడ్నాప్ చేశాడు. అతను ఆమెను స్పీడ్‌బోట్‌లోకి ఎక్కించి, తమ నియంత కిమ్ జోంగ్ ఇల్ వద్దకు తీసుకెళ్లాడు. హాంకాంగ్‌లో జరిగిన వ్యాపార ఒప్పందం  అనేది తనను కిడ్నాప్ చేయడానికి జరిగిన కుట్ర అని ఆ నటికి అప్పుడు అర్థమైంది. అయితే  తాము ఆమెను కిడ్నాప్ చేయలేదని, ఆమె ఇష్టానుసారమే  ఇక్కడికి వచ్చినట్లు కిమ్ జోంగ్ ఇల్ ప్రచారం చేయించాడు.

Exit mobile version